Kadapa Steel  Plant  :  కడప స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ బుధవారం శంకుస్థాపన చేయనున్నారు.  ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.50 గంటలకు జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లె చేరుకుంటారు. 11.10 – 11.30 జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు సంబంధించి భూమిపూజ, శిలాఫలకాలు ఆవిష్కరణ కార్యక్రమం, 11.45 – 12.45 స్టీల్‌ ప్లాంటు మౌలిక సదుపాయాలపై సమావేశం, అనంతరం 1.20 గంటలకు అక్కడినుంచి బయలుదేరి 1.40 కి పులివెందుల చేరుకుంటారు. 2.00 – 2.15 పులివెందుల ఎస్‌సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 2.40 గంటలకు పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం 4.30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.


2019 డిసెంబర్‌లో ఓ సారి శంకుస్థాపన చేసిన జగన్ 


నిజానికి స్టీల్ ప్లాంట్‌కు సీఎం జగన్ 2019లోనే ఓ సారి శంకుస్థాపన చేసారు.   2019 డిసెంబర్ 23న జగన్ కూడా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల సమీపంలో 3,275.66 ఎకరాలను ప్లాంట్ కోసం కేటాయించారు. దీని కోసం రూ.10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌ పేరిట ఒక ప్రత్యేక కంపెనీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత దానిని వైఎస్సార్ స్టీల్ కార్పోరేషన్ గా పేరు మార్చింది. దేశంలోని దిగ్గజాలైన టాటా, ఎస్‌ఆర్‌, జిందాల్‌, జేఎస్‌డబ్ల్యూ, వేదాంత సహా ఏడు ఉక్కు కంపెనీలు ముందుకు వచ్చినట్లు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది.  వాటి ఆర్థిక అంశాలను పరిశీలించిన తర్వాత భాగస్వామ్య సంస్థను ఎంపిక చేస్తామనిప్రకటించారు  ప్రాజెక్టు ఏర్పాటుకు వివాదాలులేని 3,500 ఎకరాల భూమి సిద్ధంగా ఉందని, ఏటా రెండు టీఎంసీల నీరు, నిరంతర విద్యుత్‌, నాలుగు వరుసల రోడ్లు, రైలు మార్గం ఉందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ స్టీల్ ఫ్యాక్టరీని రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. మూడేళ్లలోనే స్టీల్ ప్లాంట్ పూర్తవుతుందని తెలిపారు. కానీ ఇప్పటి వరకూ కనీసం ప్రహరి గోడను కూడా నిర్మించలేదు. 


లిబర్టీ స్టీల్స్, ఎస్సార్  తర్వాత ఇప్పుడు జేఎస్‌డబ్ల్యూ కంపెనీ ! 


మొదట్లో లిబర్టీ స్టీల్స్ కంపెనీ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. అయితే అసలు పనులు ప్రారంభించక ముందే ఆ కంపెనీ దివాలా తీసింది. దాంతో ఎస్సార్ స్టీల్స్ ప్లాంట్  పెడుతుందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎందుకో ఆ సంస్థ కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు జేఎస్‌డబ్ల్యూ సంస్థ నిర్మిస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే జేఎస్‌డబ్ల్యూ సంస్థ కూడా నిర్మిస్తుందా లేకపోతే.. శంకుస్థాపన వరకే పరిమితం చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.  


స్టీల్ ప్లాంట్ కోసం ఎదురు చూస్తున్న కడప వాసులు ! 


కడప జిల్లా అనేక రకాల ఖనిజాలకు నెలవుగా ఉంది. ఇప్పటికే యురేనియం మైనింగ్ స్వయంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే సాగుతోంది. అదే క్రమంలో పులివెందులకు సమీపంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రయత్నాలు జరిగాయి. వైఎస్ హయాంలో బ్రహ్మణి ఇండస్ట్రీస్ పేరుతో గాలి జనార్దన్ రెడ్డి స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకున్నారు. భూములు తీసుకున్నారు కానీ ప్రహరి గోడ కూడా నిర్మించలేదు. తర్వాత చంద్రబాబు శంకుస్థాపన చేశారు కానీ ప్రభుత్వం మారిపోయింది. విభజన చట్టంలో కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు గురించి పరిశీలించాలని ఉంది. దీంతో పరిశీలన జరిగిన కేంద్రం.. సాధ్యం కాదని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్మే సొంతంగా నిర్మిస్తోంది.