ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల విభజనకు ఇచ్చిన నోటిఫికేషన్లలో చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ వాసుల్లో మాత్రం ఓ విషయం హాట్ టాపిక్ అవుతోంది. అదే రాయలసీమకు బీచ్ రావడం. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజమే. చిత్తూరు జిల్లాను విభజించి శ్రీబాలాజి జిల్లాను ఏర్పాటు చేశారు. ఇది తిరుపతి పార్లమెంట్ నియోజవర్గం. ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి.  సూళ్లూరుపేట, సత్యవేడు, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాలతో ఉన్న తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని శ్రీ బాలాజీ జిల్లాగా ప్రకటించారు.


శ్రీబాలాజీ జిల్లా పూర్తిగా రాయలసీమ ప్రాంతం కాదు. అలాగని కోస్తా ప్రాంతం కూడా కాదు. ఇప్పటి వరకూ ఉన్న నెల్లూరు జిల్లా పూర్తిగా కోస్తా ప్రాంతంగా పరిగణిస్తారు. ఇప్పుడు నెల్లూరు జిల్లాలోనూ కొంత ప్రాంతం శ్రీబాలాజీ జిల్లాలోకి వెళ్లింది. అంటే.. రాయలసీమ జిల్లాలో కలిసింది అని చెప్పుకోవాలి. ఈ జిల్లాలోని సూళ్లూరుపేట, గూడురు నియోజకవర్గాల్లో సముద్రపు బీచ్‌లు ఉంటాయి. నెల్లూరు కోస్తా జిల్లాల కిందకు రావడానికి సముద్ర తీర ప్రాంతాలే కారణం. ఇప్పుడు ఆ సముద్ర తీర ప్రాంతాలు శ్రీబాలాజీ జిల్లా కిందకు వచ్చాయన్నమాట. 


బీచ్‌లు కూడా ఆ జిల్లా కిందకు రావడంతో రాయలసీమకు బీచ్ సౌకర్యం ఏర్పడిందని సెటైరిక్‌గా కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. సుళ్లూరుపేటతో పాటు మైపాడ్ బీచ్ కూడా ఇప్పుడు శ్రీబాలాజీ జిల్లా కిందకు వస్తుంది. రాయలసీమకు కూడా ఇప్పుడు బీచ్‌లు అందుబాటులోకి వచ్చాయని.. ఇక పోర్టు కడితే.. రాయలసీమ పోర్టు గా ప్రసిద్ధికెక్కుతుందని కొంత మంది అప్పుడే విశ్లేషిస్తున్నారు. మొత్తంగా రాయలసీమకు ఎవరూ ఊహించని ఓ ప్రత్యేకత జిల్లాల విభజనతో వస్తోందని అనుకోవచ్చు. 


సినిమాల్లో రాజకీయ నేతలు  బీచ్ తీసుకొస్తానని హామీలు ఇచ్చే సన్నివేశాలు ఉంటే .. బూటకపు హామీలు అని అర్థం . అయితే రాయలసీమకే చెందిన ఏపీ సీఎం జగన్ అలాంటి హామీ ఇవ్వకుండానే రాయలసీమకు సముద్రం తీసుకొచ్చేశారని.. బీచ్ కూడా తెచ్చారని కొంత మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సముద్రం మన దగ్గరకు రాకపోయినా..  మనల్ని సముద్రం దగ్గరకు సీఎం జగన్ తీసుకెళ్లారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. సముద్రం మన దగ్గరకు వచ్చిందా.. మనం సముద్రం దగ్గరకు వెళ్లామా అనేది పక్కన పెడితే.. రాయలసీమ జిల్లాల చిత్రపటంలో సముద్రం ఉందా లేదా అనేది ముఖ్యమని కొంత మంది అంటున్నారు. జిల్లాల ప్రకటన తర్వాత రాయలసీమకు సముద్రం హాట్ టాపిక్ అయింది.