CM Jagan :  ఆఖరి సిద్ధం సభలో మేనిఫెస్టో ప్రకటించేందుకు సీఎం జగన్ రెడీ అయ్యారు. బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అద్దంకిలో ఆఖరి సిద్దం సభను నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పటికే సభ రెండు సార్లు వాయిదా పడింది. చివరిగా పదో తేదీని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజులకో సారి సభా ఏర్పాట్లను పరిశీలిస్తున్న విజయసాయిరెడ్డి పదిహేను లక్షల మంది వస్తారని అంచనా అని ప్రకటిస్తున్నారు. అయితే సిద్ధం సభ మరోసారి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


సీఎం  జగన్  ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశవ్వాలని చాలా రోజులుగా అనుకుంటున్నారు. అపాయింట్‌మెంట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రధాని మోదీ  దగ్గర భరోసా తీసుకుని కొత్త కొత్త  స్కీముల్ని ఇంప్లిమెంట్ చేసి.. ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. ఇందు కోసమే ఆఖరి మంత్రి వర్గ సమావేశాన్ని కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే కొత్తగా పెట్టాల్సిన కొన్ని స్కీములపై పార్టీ నేతలు, సీనియర్లతో చర్చించారు. ఈ ప్రకారం రైతు, డ్వాక్రా రుణ మాఫీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే అధికారంలో ఉన్నాం కాబట్టి హామీలు ఇస్తే బలంగా ఉండవని పాక్షికంగా అమలు చేసేందుకు జీవోలు రిలీజ్ చేసి అయినా ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారు. అందు కోసం కొంత అర్థికపరమైన మద్దతు అవసరం. 


ప్రధాని మోదీని  కలిసి ఇదే అంశంపై విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నట్లగా తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏపీకి ఇచ్చే అప్పు పరిమితిలో ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ ఏడాదే ఇస్తే.. రెండు స్కీముల్ని పరిమితంగా అమలు చేసేందుకు జీవో ఇచ్చి.. కొంత మంది కి రుణమాఫీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చాలా బిజీగా ఉన్నారు. పదమూడో తేదీ వరకు తీరిక లేని పర్యటనలు ఉండనున్నాయి. పదమూడో తేదీ లేదా ఆ తర్వాత రోజు ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అప్పటి వరకూ మోదీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను చుట్టేయనున్నారు. ఈ క్రమంలో మోదీ అపాయింట్మెంట్ దొరకడం అంత సులువుగా కనిపించడం లేదు. 


ఇదే అంశంపై ఢిల్లీకీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల్ని పంపినా..  పెద్దగా ప్రయోజనం కలగలేదు. ప్రధాని మోదీ  చెబితే  పనైపోతుందన్న అంచనాలో ఉన్నారు. అందుకే ప్రధానిని  కలిసేందుకు సీఎం జగన్ చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అనుకున్నట్లుగా జరిగితే కేబినెట్‌లో నిర్ణయాలు తీసుకుని. జీవోలు ఇచ్చేస్తే.. ఇక  ఎలక్షన్ కోడ్ వచ్చినా  సమస్య ఉండదని అనుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఖాతాల్లో డబ్బులు వేయవచ్చని  అుకుంటున్నారు. అందుకే చివరి కేబినెట్ భేటీని.. సిద్ధం సభను పదే పదే వాయిదా వేస్తూ వస్తున్నారు. 


ఇప్పటికీ ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ దొరుకుతుందన్న  నమ్మకంతో సీఎం  జగన్ ఉన్నారని.. మరో వారం రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నందున ఈ లోపే.. ప్రధానిని కలిసి అనుమతులు తీసుకుని ఆ తర్వాతే బాపట్ల సిద్ధం  సభను నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది.