CM Jagan Speech in Ramayapatnam Port: రామాయపట్నం పోర్ట్ కి భూమిపూజ అనంతరం జరిగిన బహిరంగ సభలో చంద్రబాబుపై విరుచుకు పడ్డారు సీఎం జగన్. గతంలో చంద్రబాబు ఈ పోర్ట్ కి శంకుస్థాపన చేశామని చెప్పుకుంటున్నారని, అది పూర్తిగా అవాస్తవం అన్నారు. 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశామంటున్నారని, అప్పటికి భూ సేకరణ జరగలేదు, డీపీఆర్ లేదు.. అయినా శంకుస్థాపనకు టెంకాయ కొట్టారని, అది ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు జగన్. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ఎన్నికలకు 2 నెలల ముందు ఇక్కడికి వచ్చి టెంకాయ కొట్టి, శంకుస్థాపన అనే పేరు చెప్పి ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు. ఇంతకంటే అన్యాయం ఉందా, మోసం ఉందా? అని ప్రశ్నించారు జగన్. 


ఎన్నికల సమయంలో రుణ మాఫీ అంటూ రైతుల్ని, అక్క చెల్లెలలను మోసం చేశారని, ఉద్యోగాలంటూ యువతని మోసం చేశారని చంద్రబాబుపై మండిపడ్డారు జగన్. తమ హయాంలో అలాంటి మోసాలేవీ జరగలేదని, జరగబోవని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రామాయపట్నం పోర్ట్ కి 850 ఎకరాలు భూసేకరణ చేసి డీపీఆర్ తో పనులు మొదలు పెట్టామని అన్నారు జగన్. ప్రస్తుతం పోర్ట్ లో తొలి దశలో 4 బెర్త్ లు నిర్మిస్తున్నామని, దాని కోసం రూ.3,740 కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నామని చెప్పారు. 25 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశముంటుందని చెప్పారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కోరిక మేరకు.. పోర్ట్ కి అనుసంధానంగా పారిశ్రామకి కారిడార్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. 


ఉద్యోగ అవకాశాలు.. 
పోర్ట్ నిర్మాణం వల్ల స్థానికులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, దీని ద్వారా నిర్మించే పరిశ్రమలతో మరింత ఉపయోగం ఉంటుందని తెలిపారు. పోర్ట్ వల్ల ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా బాగా తగ్గిపోతాయని అన్నారు. ఇక్కడ వచ్చే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వస్తాయన్నారు జగన్. పోర్ట్ ఉన్న ప్రాంతమే కాదు, రాష్ట్ర రూపు రేఖలు కూడా మారిపోతాయని చెప్పారు జగన్. 


కందుకూరు నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించారు సీఎం జగన్. కందుకూరు మున్సిపాల్టీ డెవలప్ మెంట్ కి హామీ ఇస్తున్నానని అన్నారు. ఎప్పుడు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికి పిలిచినా తాను వస్తానని, ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి తన వద్దకు రావచ్చని చెప్పారు. 25కోట్ల రూపాయలను బైపాస్ రోడ్ కోసం మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఆర్ అండ్ ఆర్ లే అవుట్ లో ఇళ్ల పట్టాలను సీఎం జగన్ లబ్ధిదారులకు అందించారు.