YSR Kapu Nestham Funds Release: కాపు నేస్తం మాత్రమే కాదు.. వారికి మన చేతల ద్వారా కాపు కాస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం వరుసగా మూడో ఏడాది అమలు చేస్తున్నామని తెలిపారు. ‘‘మూడేళ్లలో ఇప్పటివరకూ ఒక్కొక్కరికీ రూ.45 వేలు ఇచ్చాం. ఇప్పటివరకూ వైఎస్సార్‌ కాపు నేస్తం కింద రూ.1,492 కోట్లు సాయం అందించాం. నవ రత్నాల ద్వారా మూడేళ్లలో కాపు సామాజిక వర్గానికి 16,256 కోట్ల లబ్ధి జరిగింది. నాన్‌ డీబీటీ ద్వారా కాపు సామాజిక వర్గానికి మరో రూ.16 వేల కోట్లు అందాయి. మొత్తంగా కాపు సామాజిక వర్గానికి మూడేళ్లలో 32,296 కోట్లు అందాయి. కాపు నేస్తం కింద అర్హులైన 3,38,792 మందికి రూ.508.18 ​‍కోట్ల లబ్ధి కలిగింది.’’ అని సీఎం జగన్ వివరించారు. వైఎస్ఎస్ కాపు నేస్తం పథకం కింద నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నుంచి విడుదల చేశారు. 


అంతకుముందు వైఎస్ జగన్ బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘నవరత్నాలలోని పథకాల ద్వారా ఒక్క కాపు సామాజిక వర్గానికే డీబీటీ ద్వారా గానీ, కాపు కార్పొరేషన్ ద్వారా గానీ కలిగిన లబ్ధి ఈ మూడేళ్లలో రూ.16,256 కోట్లు. ఇవి కాక, ఇళ్ల పట్టాల పంపిణీ, నిర్మాణ పథకాల ద్వారా కాపు కుటుంబాలకు కలిగిన లబ్ధి మరో రూ.16 వేల కోట్ల రూపాయలు. కాపులకు ప్రతి ఏటా రూ.వెయ్యి కోట్లను ఐదేళ్ల బడ్జెట్‌లలో ప్రవేశపెడతానని, చంద్రబాబు చెప్పారు. కనీసం రూ.1500 కోట్లు. ఆయన చేసిన అనేక మోసాల్లో ఇదొకటి’’ అని సీఎం జగన్ విమర్శించారు.