CM Jagan TIDCO Houses: రాష్ట్రంలోని అతిపెద్ద టిడ్కో లే అవుట్లలో ఒకటైన కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీ పరిధిలోని మల్లాయపాలెంలో 77 ఎకరాల్లో నిర్మించిన 8,912 టిడ్కో ఇళ్లను సీఎం జగన్ ప్రారంభించారు. మరో 178.63 ఎకరాల్లో సిద్ధం చేసిన 7,728 మందికి ఇళ్ల పట్టాలు, కడుతున్న 4,500 ఇళ్లకు పట్టాలను కూడా నేడు పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు 300 చ.అ. టిడ్కో ఇళ్లను ప్రభుత్వం కేవలం రూపాయికే అన్ని హక్కులతో అందజేస్తోంది. టిడ్కో గృహ సముదాయాన్ని ప్రారంభించడానికి ముందుగా అక్కడే ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. మల్లాయపాలెం టిడ్కో లే అవుట్‌లోని టిడ్కో ఇళ్ల మధ్య నుంచి సీఎం రోడ్ షో కొనసాగింది. రోడ్ షోలో సీఎంకు అపూర్వ స్వాగతం పలికారు వైసీపీ శ్రేణులు. దారిపొడవునా పూల వర్షం కురిపించారు. తమ సొంతింటి కల నెరవేర్చిన సీఎం జగన్‌కు గుడివాడ జేజేలు పలికారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్ కుమార్, సింహాద్రి రమేష్ బాబు, వల్లభనేని వంశీ పాల్గొన్నారు.
చంద్రబాబు చేసిందేంటి..?
16,601 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి టిడ్కో ఇళ్లు ఇచ్చామన్నారు జగన్. టీడీపీ మాత్రం ఆ ఇళ్ల పేరుతో 3 లక్షల రూపాయలు ప్రజలపై భారం వేసిందని గుర్తు చేశారు. ఇది ఇరవై ఏళ్లు ఉండేలా చేసిందన్నారు. ఇందులో చంద్రబాబు చేసిందేంటని ప్రశ్నించారు. చంద్రబాబు గుమస్తాగిరి కూడా సరిగా చేయలేదని ఎద్దేవా చేశారు. గుడివాడలో పేదలకు చంద్రబాబు ఒక్క సెంటు స్థలం, ఇళ్లు కూడా ఇవ్వలేదన్న్నారు సీఎం జగన్. 8,659 ఇళ్లకు అదనంగా జూలై 7న మరో 4,200 ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రాష్ట్రంలో 30.68 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 వేల జగనన్న కాలనీలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. వీటి వెలువ రూ.2 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు.
గుడివాడ నియోజకవర్గం పరిధిలోని 10 వేల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాల కోసం 2007లో మంత్రి కొడాలి నాని పాదయాత్ర చేశారు. గుడివాడ నుంచి హైదరాబాద్ వరకు 320 కి.మీ పాటు నడిచి పాదయాత్ర పూర్తి చేశారు. అప్పటి సీఎం, దివంగత నేత వైఎస్సార్‌కు వినతిపత్రం అందించారు. రెండోసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అవ్వగానే మల్లాయపాలెంలో 77.46 ఎకరాలను సేకరించి.. పేదలకు పంపిణీ చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా గెలిచిన చంద్రబాబు నాయుడు మల్లాయపాలెంలో పేదల ఇళ్ల పట్టాలను రద్దు చేశారు. 2019 ఎన్నికలకు ముందు టిడ్కో ఇళ్లు పూర్తి కాకుండానే లబ్ధిదారులకు చంద్రబాబు టిడ్కో ఇళ్ల పంపిణీ చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. ఇళ్ల నిర్మాణం కోసం జగన్ సర్కారు ఏకంగా రూ.799.19 కోట్లు ఖర్చు చేసింది. టిడ్కో ఇళ్లకు అదనంగా మరో 178.63 ఎకరాలు సేకరించి.. 7,728 మంది పేదలకు పంపిణీ చేసింది. టిడ్కో ఇళ్ల పక్కనే మరో 4,500 ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి.
గుడివాడ సమీపంలో 300 ఎకరాల్లో 8వేల 912 ఇళ్లను నిర్మించారు. అంతేకాకుండా, నవరత్నాలు-పేదలందరికీ ఇల్లు పథకం కింద టిడ్కో కాలనీకి ఆనుకుని 6వేల 700 వ్యక్తిగత ఇళ్లు కూడా నిర్మిస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 27వేల 872 ఇళ్లు నిర్మాణం జరుగుతోంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా AP TIDCO.. పట్టణ ప్రాంతాల్లో 27వేల 872 ఇళ్లను నిర్మిస్తోంది. విజయవాడ, మచిలీపట్నం, గుడివాడ, జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, ఉయ్యూరులో ఈ ఇళ్లను నిర్మిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి, పేదల గృహ అవసరాలను తక్కువ ఖర్చుతో తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రూపొందించిన ఉమ్మడి వెంచర్ TIDCO గృహాలు.