CM Jagan Comments: టీడీపీ అధినేత చంద్రబాబు ఓటుకు ఇచ్చే రూ.వెయ్యి, రూ.2 వేలకు ప్రజలు మోసపోవద్దని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోరారు. మీ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే ఉంటుందని చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ఎప్పటిలాగే విమర్శలు, ఆరోపణలు చేశారు. చంద్రబాబు డబ్బులు పంచితే తీసుకోవాలని.. ఓటు మాత్రం జగన్ కే వేయాలని కోరారు. చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలని.. చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండ అని జగన్ ఎద్దేవా చేశారు.


చంద్రబాబు తాను దోచుకున్న సోమ్ముతో ప్రతి ఎన్నికలకు నోట్లు ఇచ్చి ఓట్లు కొనాలని ప్రయత్నిస్తుంటారని ఆరోపించారు. ఆయన ఇచ్చే వెయ్యి, రెండు వేలకు ప్రజలు మోసపోవద్దని పిలుపు ఇచ్చారు. మీ బిడ్డ జగన్ మళ్ళీ అధికారంలోకి రాగానే ప్రతి సంవత్సరం ఏ నెల ఏయే పథకాలు వస్తాయో, దేనికి డబ్బులు అందుతాయో తెలియజేస్తూ క్యాలెండర్ అందిస్తామని చెప్పారు. గుర్తుపెట్టుకోండి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పండుగే.. ఉంటుందని అన్నారు. ఆ పథకాలన్నీ కొనసాగాలంటే జగనే రావాలని పిలుపు ఇచ్చారు.


2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రతి ఇంటికి తన సంతకంతో మేనిఫెస్టో పంపారని జగన్ గుర్తు చేశారు. ఆ హామీల్లో ఒక్కటి కూడా ఇప్పటిదాకా నెరవేర్చలేదని చంద్రబాబు అన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపు పలికినట్లే అవుతుందని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా సభల్లో ఎక్కడ కూడా ప్రత్యేక హోదా ప్రస్తావన తేవడం లేదని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్లకు కావాల్సినవి మాత్రమే మాట్లాడారని జగన్ అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జతకడతారని ప్రశ్నించారు. మరోవైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నారని.. ఆరునూరైనా ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. 


2019 ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పథకం డబ్బులు వేయడానికి అనుమతిచ్చిన ఎన్నికల సంఘం.. ఇప్పుడు నిరాకరించిందని జగన్ విమర్శించారు. కూటమి పార్టీల ఒత్తిడి, ఫిర్యాదుల వల్లే ఈ డబ్బులు పేదలను చేరకుండా ఈసీ అడ్డుకుందని అన్నారు.