CM Jagan Tour : ఏపీ సీఎం జగన్ రేపు(సోమవారం) పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన కార్యక్రమాల్లో సీఎం పాల్గోనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా విశ్వవిద్యాలయానికి సీఎం జగన్  శంకుస్థాపన చేయనున్నారు. బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ కు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.


ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా విశ్వవిద్యాలయం


నరసాపురంలో ఆంధ్రప్రదేశ్‌ ఆక్వా విశ్వవిద్యాలయం పేరుతో ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం స్థాపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తమిళనాడు, కేరళ తర్వాత ఇది దేశంలో మూడో ఆక్వా విశ్వవిద్యాలయం కాబోతుంది. ఇందుకోసం నరసాపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న సరిపల్లి, లిఖితపూడి గ్రామాల మధ్య 40 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించారు. భవన నిర్మాణ పనుల కోసం మొత్తం రూ. 332 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ కు ఆమోదం లభించింది. యూనివర్సిటీ రెండో దశ పనులలో భాగంగా నరసాపురం మండలంలోని బియ్యపుతిప్ప గ్రామంలో 350 ఎకరాలలో రూ. 222 కోట్ల అంచనా వ్యయంతో విశ్వవిద్యాలయ సముద్రతీర ప్రాంగణం పరిశోధనా కేంద్ర నిర్మాణాలను ప్రభుత్వం చేపడుతుంది. మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు ద్వారా మత్స్యకారులు, ఆక్వాకల్చర్‌ రైతులు ఎక్కువగా ప్రయోజనం పొందనున్నారు. వృత్తిపరంగా అర్హత కలిగిన మానవ వనరుల లభ్యత కారణంగా ఆక్వాకల్చర్‌ రంగంలో పంట నష్టాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. దాదాపు సంవత్సరానికి రూ. 4,000 నుంచి 5,000 కోట్ల ఆర్థిక ప్రయోజనం ఆక్వా రైతులకు చేకూరుతుంది. అవసరమైన సంఖ్యలో ఫిషరీస్‌ డిప్లొమా, బీఎఫ్‌ఎస్‌సీ, ఎంఎఫ్‌ఎస్‌సీ, పీహెచ్‌డీ అర్హత గల అభ్యర్థులను తయారుచేయడానికి ఆక్వా యూనివర్సిటీ ఆధ్వర్యంలో మరిన్ని కొత్త మత్స్య కళాశాలలు మత్స్య పాలిటెక్నిక్‌ కళాశాలలు ప్రారంభించే ప్రతిపాదనలు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఈ యూనివర్శిటీ స్థాపనతో ప్రొఫెషనల్‌ మ్యాన్‌ పవర్‌ కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది.


బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ శంకుస్థాపన 


బియ్యపుతిప్ప వద్ద 150 ఎకరాల విస్తీర్ణంలో రూ. 429.43 కోట్ల అంచనాతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించేందుకు, ఇప్పటికే ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ హార్బర్‌ నిర్మాణం ద్వారా మత్స్యకారులకు అత్యంత సామర్థ్యం గల మోటారు బోట్లలో సముద్రంలో లోతుగా వేటకు వెళ్లేందుకు అవకాశాలను కల్పిస్తుంది. దీంతో పాటు మార్కెటింగ్‌ సౌకర్యాలను పెంపొందించేందుకు, మత్స్య పరిశ్రమను అభివృద్ది చేసేందుకు, అవసరమైన అన్ని ఏర్పాట్లు ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ హార్బర్‌ నిర్మించే ప్రదేశం నరసాపురం పట్టణానికి 14 కి.మీ. దూరంలో ఉంది. దీనివల్ల నరసాపురం,మొగల్తూరు మండలాలకు చెందిన సుమారు 6,000 మంది మత్స్యకారులు లబ్ధిపొందనున్నారని ప్రభుత్వం వెల్లడించింది.


నరసాపురం అగ్రికల్చర్‌ కంపెనీ భూములు 


నరసాపురం మండలం నందలి వేములదీవి ఉప గ్రామంగా ఉన్న దర్బరేవులో బ్రిటీష్‌ ప్రభుత్వం 1921లో  1,754 ఎకరాల భూమిని నరసాపురం అగ్రికల్చర్‌ కంపెనీ లిమిటెడ్‌ కి 99 సంవత్సరాల లీజుకు ఇచ్చింది. ఆ రోజు నుంచి 1623 మంది రైతులు సదరు భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నారు. కానీ రైతులకు ఎటువంటి భూ యాజమాన్య హక్కులు కానీ రెవెన్యూ రికార్డు పరమైన హక్కులు కానీ లేవు. అందువల్ల ఆ భూమిని అమ్మడానికి , బ్యాంకులలో తనఖా పెట్టి ఋణం పొందడానికి కానీ అర్హత లేకుండాపోయింది. అయితే  ప్రభుత్వం జీవో జారీ చేసి ఎకరాకు రూ. 100 ధర నిర్ణయించి, ఆ 1623 మంది రైతులకు భూ యాజమాన్య రెవెన్యూ రికార్డు పరమైన సర్వహక్కులు కల్పించింది. దీంతో రైతులు వారి వారసులు నిరభ్యంతరంగా స్వాధీనంలో చేసుకోని అనుభవించుకోవచ్చు. అవసరాల నిమిత్తం అమ్ముకోవచ్చు, తనఖా పెట్టి రుణాలు కూడా పొందే అవకాశం లభించింది.


ఉప్పుటేరు నదిపై మూలపర్రు రెగ్యులేటర్‌ శంకుస్థాపన 


సముద్రపు నీరు కొల్లేరు సరస్సులోకి చొరబడకుండా నిరోధించడానికి కొల్లేరులో 5వ కాంటూర్‌ వరకూ మంచినీరు నిలువ ఉండే విధంగా ఉప్పుటేరు నది పై రూ. 188.40 కోట్లు అంచనా వ్యయంతో రెగ్యులేటర్‌ కమ్‌ బ్రిడ్జ్‌ కమ్‌ లాక్‌ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. నరసాపురం పట్టణంలో ప్రాంతీయ వైద్యశాల ఇటీవలే 100 పడకల స్థాయికి పెంచారు. చుట్టుపక్కల గ్రామాల్లో నివసించే 2 లక్షల మందికి వైద్య సదుపాయాలు, సేవలు అందించటంతో పాటుగా నూతనంగా మాతా శిశు సంరక్షణ విభాగం ఏర్పాటు చేయడం కోసం  రూ. 13 కోట్లతో  నూతన భవన నిర్మాణం చేపట్టారు.