Sajjala Ramakrishna Reddy: ఆంధ్రప్రదేశ్ లో నిజమైన అభివృద్ధి అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డి చేసి చూపిస్తారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యమని స్పష్టం చేశారు.  చంద్రబాబు పాలనలో కనీసం విజయవాడలో ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన..అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు అండ్ కో దోచుకోవడం తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదని విమర్శించారు. రాజధానిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.  


అమరావతి డిక్లేర్‌ చేశాక చంద్రబాబు కేంద్రాన్ని సంప్రదించకుండా.. అప్పటి మంత్రి నారాయణతో కమిటి వేసి వారంలో రాజధాని ప్రకటించారని గుర్తు చేశారు. అమరావతిని బంగారు గుడ్డుపెట్టే బాతులా మార్చాలనుకున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. చంద్రబాబు అమరావతిని ఏటీఎంలా మార్చుకుని దోచుకున్నారని సజ్జల మండిపడ్డారు.  ఆనాడు సీఎంగా ఉండి చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలా వ్యవహరించారని విమర్శించారు. చంద్రబాబు బినామీల పేరుతో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ చేశారని విమర్శించారు. ఐదేళ్లలో చంద్రబాబు అమరావతిపై కేవలం రూ.5వేల కోట్లు ఖర్చు పెట్టారని గుర్తు చేశారు. టెంపరరీ బిల్డింగ్‌లు, సగం రోడ్లు వేసి వదిలేశారన్నారు. 


ఎమ్మెల్యే కోటంరెడ్డి అంశంతో చంద్రబాబు లబ్ధిపొందాలని చూస్తున్నారని సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎలాంటి ఫోన్‌ ట్యాపింగ్‌ జరగకపోయినా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలోనే ఇజ్రాయెల్‌ టెక్నాలజీతో ఫోన్‌ ట్యాపింగ్‌లు చేశారని నిలదీశారు.  సీఎం జగన్‌ అసెంబ్లీలో మాట్లాడిన మాటలను చంద్రబాబు వక్రీకరిస్తున్నారు. చంద్రబాబు స్థాయి దిగజారి వ్యవహరిస్తున్నారు. రాజకీయంగా టీడీపీ దయనీయ స్థితిలో ఉందని.. అందుకే లేనిపోనివి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ప్రజలతో మాట్లాడే పాయింట్లు లేకపోవడంతో టీడీపీ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


చంద్రబాబు ఏమన్నారంటే?


 ఏపీ రాజధాని విషయంలో జగన్‌ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు.  ఏపీ రాజధానిపై నిన్న సుప్రీంకోర్టు లో కేంద్రం అఫిడవిట్ వేసిందని..  శివరామకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం సుప్రీంకోర్టులో ప్రస్తావించిందని  చంద్రబాబు స్పష్టం చేశారు.   శివరామకృష్ణ కమిటీ నివేదికను రాష్ట్రానికి పంపామని తెలిపింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అమరావతి ని రాజధానిగా ఎంపిక చేసిందని కేంద్రం తెలిపింది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఆమోదించామని కేంద్రం చెప్పింది. రాజధానిగా అమరావతిని మెజార్టీ ప్రజలు ఆమోదించారు. ఏపీ ప్రభుత్వం  తమను సంప్రదించకుండానే 3 రాజధానుల చట్టం తెచ్చిందని.. కేంద్రం అఫిడవిట్‌లో స్పష్టంగా తెలిపింది. ఎంపీ విజయసాయిరెడ్డి  ప్రశ్నకు సమాధానంగానే కేంద్రం ఈ విషయాలు చెప్పిందని  చంద్రబాబు గుర్తు చేశారు. 


ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో జగన్ కూడా అమరావతికి ఆమోదం 


అమరావతిని తాము ఏకపక్షంగా..రహస్యంగా రాజధానిగా నిర్ణయించలేదని.. ఏకాభిప్రాయంతో ఏర్పాటు చేశామన్నరు. అసెంబ్లీలో ప్రస్తుత సీఎం జగన్.. ప్రతిపక్ష నేతగా ఆమోదం తెలిపారని చంద్రబాబ ుగుర్తు చేశారు. .చట్టంలో లేని అధికారాన్ని జగన్   తన చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారని విమర్శించారు.  జగన్ చేసే విధ్వంసాలను సరిదిద్దడం.. రాజ్యాంగ సంస్థలకు కూడా కష్టంగా మారిందన్నారు. చట్టానికి వ్యతిరేకంగా జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి ఏర్పాటు రహస్యంగా చేసింది కాదని, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో చర్చలు జరిపామని తెలిపారు.