Jagan In Delhi: ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి బయల్దేరారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న జగన్.. అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో హస్తినకు పయనమయ్యారు. రాత్రికి జగన్ ఢిల్లీకి చేరుకోనుండగా.. అనంతరం రోడ్డు నెంబర్ 1లోని జన్ ‌పథ్ నివాసంలో బస చేయనున్నారు. శుక్రవారం ఉదయం ప్రధాని మోదీతో జగన్ భేటీ కానున్నారు. ఈ మేరకు మోదీ అపాయింట్‌మెంట్ ఇప్పటికే ఫిక్స్ అయింది. గురువారం మధ్యాహ్నం ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో హుటాహుటిన జగన్ ఢిల్లీకి బయల్దేరారు. ఏపీ అభివృద్ది, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన  హామీలపై మోదీతో జగన్ చర్చిస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పోలవరం నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన పన్ను వాటా చెల్లింపులు, విశాఖ స్టాల్ ప్లాంట్ అంశాలపై ప్రధానితో సీఎం మాట్లాడతారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


అలాగే ఏపీలో మెడికల్ కాలేజీల ఏర్పాటు కోసం కేంద్రం నుంచి మరింత వాటా, ప్రత్యేక హోదాపై మోదీకి జగన్ వినతిపత్రం అందించనున్నారని తెలుస్తోంది. దీంతో పాటు ఎన్నికలకు మరో రెండు నెలలు మాత్రమే సమయం ఉండటంతో ఏపీలోని రాజకీయ పరిణామాలను కేంద్రానికి వివరించే అవకాశముంది. మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా జగన్ కలవనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేబినెట్ మంత్రులతో చర్చించనున్నారు. ప్రభుత్వ పరంగా అధికారిక పర్యటన అని చెబుతున్నప్పటికీ.. ఇది రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ముందుగా ఎలాంటి షెడ్యూల్ లేకుండా హఠాత్తుగా ప్రధాని నుంచి పిలుపురావడం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ అయ్యారు. మరుసటి రోజే మధ్యాహ్నమే జగన్‌కు మోదీ నుంచి కబురు రావడం కీలకంగా మారింది.


అమిత్ షా నుంచి పిలుపురావడంతో మంగళవారం సాయంత్రం హస్తిన పర్యటనకు చంద్రబాబు వెళ్లారు. బుధవారం రాత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో జేపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఏపీలోని పొత్తులపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు గంటన్నర పాటు ఈ భేటీ జరిగింది. ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీతో పొత్తుపై ప్రధానంగా చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే  సీట్ల సర్దుబాటుపై కూడా ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. మూడు పార్టీల పొత్తు దాదాపు ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మోదీని జగన్ కలవనుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి ట్విస్ట్‌లు చోటుచేసుకుంటాయనేది ఉత్కంఠ రేపుతోంది. ఏపీ అధికార, ప్రతిపక్ష నేతలు ఇద్దరూ ఢిల్లీ టూర్లకు వెళ్లడంతో.. రాష్ట్ర రాజకీయాలన్నీ హస్తిన చుట్టూనే తిరుగుతున్నాయి.  ఈ పర్యటనలతో ఏపీలో పొత్తులపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశముంది. అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఉంటుందనే వార్తలొస్తున్నాయి. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తులపై పూర్తి స్పష్టత రానుందని తెలుస్తోంది.