YSRCP Fifth List : వైసీపీ అధినేత సీఎం జగన్ మరికొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో మార్పు చేర్పులపై కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువుర్ని క్యాంప్ ఆఫీస్‌కు పిలిలిపిస్తున్నారు. తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ,మంత్రి కొట్టు సత్యనారాయణ సీఎం క్యాంప్ ఆఫీసుకి వచ్చారు. ఇంఛార్జిల మార్పులు, వారి నియోజకవర్గాల్లో ఉన్న పరిస్థితులపై జగన్ చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు రాజీనామా చేయడంతో నరసరావుపేట పార్లమెంట్ ఇంఛార్జిగా ఒక బీసీ నేతను ప్రకటించే పనిలో వైసీపీ అధినాయకత్వం ఉంది. పలువురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. బీసీ నుంచి యాదవ సామాజికవర్గానికి చెందిన వారికి ఇస్తారా? లేక వేరే సామాజికవర్గానికి ఇస్తారా? అన్నదానిపై క్లారిటీ ఇవాళ వచ్చే అవకాశం ఉంది. యువనాయకుడు యనమల నాగార్జున యాదవ్ పేరు ఎక్కువగా పరిశీలనలోకి వస్తోంది. ఒంగోలు ఎంపీ స్థానం ఇంకా పెండింగ్ లో ఉంది. అక్కడ మాగుంటకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని చెప్పడంతో కొత్త అభ్యర్థిని ఎవరిని తీసుకురాబోతున్నారు అనేదానిపై కసరత్తు చేస్తున్నారు సీఎం జగన్.
మరో వైపు రేపల్లెలో ఇటీవల ఇంచార్జిగా ప్రకటించిన ఈపూరి గణేష్‌ను మార్చాలని సీఎం జగన్ భావిస్తున్నట్లుగా తెలు్సతోంది. ఎంపీ మోపిదేవి వెంకటరమణ రేపల్లె పార్టీ ఇంఛార్జిగా తొలగించి ఈవూరు గణేష్ ను నియమించింది వైసీపీ హైకమాండ్. ఆయన నియామకంపై మోపిదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే తర్వాత సర్దుకుపోయారు. కానీ ఈపూరి గణేష్ అంత చురుకుగా లేకపోవడంతో సీఎం జగన్ మరోసారి ఆలోచిస్తున్నట్లుగా తెలు్సతోంది. రేపల్లె ఇంఛార్జిగా తనకు అవకాశం ఇవ్వాలని మోపిదేవి కోరుతున్నారు. రేపల్లె ఇంఛార్జ్ ను మారుస్తారా? లేక ఈపూరు గణేశ్ ను కొనసాగిస్తారా? అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
టిక్కెట్ల జాబితా కసరత్తు కొనసాగుతూండటంతో టిక్కెట్ వస్తుందో రాదోనన్న ఉద్దేశంతో చాలా మంది ఎమ్మెల్యేలు ప్రచారం ప్రారంభించలేదు. సీఎం ఏం ఆలోచిస్తారో తెలియడం లేదు. మార్చే ఉద్దేశం లేని వారికి కూడా ప్రచారం చేసుకోవాలన్న సూచనలు రాకపోవడంతో వారు కూడా ముందూ వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితి వైసీపీలో గడ్డు పరిస్థితుల్ని సష్టిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేల్లో ఎక్కవ మంది టిక్కెట్ వస్తే వచ్చిందిరాకపోతే లేదని అనుకుంటున్నారు. ఇలాంటి కసరత్తులు సుదీర్ఘంగా సాగడం వల్ల టిక్కెట్ రాదని భావిస్తున్న వారిపై జంపింగ్ రూమర్స్ పుట్టుకు వస్తున్నాయి.