ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు సుప్రీం కోర్టులో నేడు (ఫిబ్రవరి 13) విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ విచారణలు వేర్వేరుగా జరుగుతున్న సంగతి తెలిసిందే. సీబీఐ, ఈడీ విచారణలు ఒకేసారి జరిగినా సీబీఐ కేసుల్లో తీర్పు ఇచ్చిన తరువాతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ సీబీఐ విచారణ ముగిసిన తర్వాతే ఈడీ విచారణ చేపట్టాలని భారతి సిమెంట్, విజయసాయి రెడ్డి, తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు, తెలంగాణ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఈడీ సవాలు చేసింది.
ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం విచారణ చేసింది. సీబీఐ కేసుల్లో తీర్పు తర్వాతే ఈడీ కేసుల్లో తీర్పు ఇవ్వాలా? లేదా? అనే నిర్ణయాధికారం సీఆర్పీసీ సెక్షన్ 309 ప్రకారం ట్రయిల్ కోర్టుకే ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదేశాలు కూడా ఇస్తామని ధర్మాసనం పేర్కొంది. ఈలోగా ఈ కేసుతో పాటు వేరే కేసులు కూడా ఉన్నాయని ధర్మాసనం దృష్టికి ఈడీ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్ కౌన్సిల్ తుషార్ మెహతా తీసుకువచ్చారు. దీంతో తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.