Penmatsa : విజయనగరం జిల్లాలో మొదట వైసీపీ జెండా మోసిన వ్యక్తుల్లో దివంగత నేత, మాజీ మంత్రి పెనుమత్స సాంబశివరాజు ఒకరు. అనంతర పరిణామాలతో సాంబశివరాజు జీవించి ఉన్నంత కాలం ఆ కుటుంబానికి పార్టీ పరంగా జగన్ సముచిత ప్రాధాన్యమివ్వలేదనే ఆవేదన అభిమానుల్లో ఉండేది. సాంబశివరాజు తనయుడు డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణ రాజు 2014 ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి బరిలో దిగినా.. అప్పటి పరిస్థితుల ప్రభావంతో టీడీపీ గెలిచింది. తర్వాత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించినా భంగపాటు తప్పలేదు. బడ్డుకొండ అప్పలనాయుడు వైపే జగన్ మొగ్గు చూపారు. సాంబశివరాజు మరణం తర్వాత ఆ సానుభూతి వల్లనో, రుణం తీర్చుకుందామన్న ఉద్దేశమో గానీ... సురేష్‌బాబుకు ఎమ్మెల్సీ పదవిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారు. ఈ పదవిలో దాదాపుగా రెండున్నరేళ్లే కొనసాగారు. మరోసారి అవకాశమిస్తారా, ఇవ్వరా? అన్న చర్చ సర్వత్రా సాగింది. ఈ సారి ఆయన స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలన్న డిమాండ్లూ వెళ్లాయి. కానీ, ముఖ్యమంత్రి జగన్.. సూర్యనారాయణరాజు వైపే మొగ్గు చూపారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా మరోసారి అవకాశం కల్పించారు.
పార్టీకి విధేయుడు పెన్మత్స
క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన పెనుమత్స సురేష్‌బాబు.. ఆది నుంచి పార్టీ పట్ల విధేయతగా మెలిగారు. వివాదరహితంగా ఉంటూ, అందరితోనూ కలసిపోయే మనస్తత్వం వల్లే ఆయనకు మళ్లీ ఎమ్మెల్సీ పదవి వరించింది. ఏపీలో వైసీపీ ప్రకటించిన ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో ఎమ్మెల్యేల కోటాలో శాసన మండలి సభ్యుడుగా మరోసారి అడుగుపెట్టే అవకాశం లభించింది. సూర్యనారాయణరాజు. సురేష్‌బాబుగా అందరికీ ఆయన సుపరిచితం. విజయనగరం పట్టణంలోనే కొన్నాళ్లు దంతవైద్యుడిగా సేవలందించారు. మొదట్లో క్రియాశీలక రాజకీయాలపై ఆయన అంతగా ఆసక్తి చూపలేదు. తండ్రి మంత్రిగా ఉన్న సమయంలోనూ సురేష్‌బాబు ఏనాడూ దర్పం చూపలేదు. రాజకీయాలకు దూరంగానే ఉండేవారు. తన వృత్తి చేసుకుని వెళ్లిపోతుండేవారు. వయస్సు మీద పడ్డాక రాజకీయాల్లో సాంబశివరాజు ప్రభావం తగ్గింది. బొత్స సత్యనారాయణతో విభేదాల వల్ల సాంబశివరాజు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేశారు. తర్వాత కొన్నాళ్లకు వైసీపీలో చేరి, జిల్లావ్యాప్తంగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. వృద్ధాప్యం కారణంగా మునుపటి మాదిరి ఆయన తిరగలేకపోవడంతో స్నేహితులు, బంధువుల వల్ల సురేష్‌బాబు ప్రత్యక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు.
ఓడినా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రోత్సహిస్తున్న సీఎం జగన్
2014 ఎన్నికల్లో సురేష్‌బాబు వైసీపీ తరఫున నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి చేతిలో ఓటమి చెందారు. 2019 ఎన్నికల సమయానికి మరోసారి టికెట్ ఆయనకే వస్తుందని భావించినా.. కాంగ్రెస్ నుంచి వచ్చిన బడ్డుకొండ అప్పలనాయుడు తన్నుకుపోయారు. అప్పట్లో పెనుమత్స వర్గీయులు దీనిపై ఆవేదన చెందినా.. అధినేత నిర్ణయాన్ని ఏనాడూ ధిక్కరించలేదు. సాంబశివరాజు కుటుంబానికి జగన్ సముచిత ప్రాధాన్యం ఇవ్వలేదని ఆయన అనుయాయుల్లో అసంతృప్తి ఉండేది. కొవిడ్ సమయంలో సాంబశివరాజు మృతి చెందారు. అదే సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న మోపిదేవి వెంకటరమణను రాజ్యసభకు పంపడంతో.. తద్వారా ఖాళీ అయిన స్థానాన్ని సాంబశివరాజు కుమారుడు సురేష్‌బాబుకు ఇస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఆ విధంగా శాసనమండలిలో అడుగుపెట్టిన సురేష్‌బాబుకు.. అడుగడుగునా చేదు అనుభవమే ఎదురైంది. నెల్లిమర్ల నియోజకవర్గంలో ఆయనకు తగిన గౌరవం దక్కలేదు. అధికారులు సైతం ప్రోటోకాల్ పాటించడం లేదని పలు సందర్భాల్లో ఆయన ఆవేదన చెందారు. నెల్లిమర్ల నియోజకవర్గంలో సాంబశివరాజు వర్గానికి చెక్ పెట్టాలని, సురేష్‌బాబు పోటీ దారు కాకూడదన్న ఉద్దేశంతో ఆయనకు వ్యతిరేకంగా అనేక కోటరీలు నడిచాయి. సురేష్‌బాబుకు బలగమే లేదని, ఆ స్థానాన్ని వేరొకరికి ఇస్తే వచ్చే ఎన్నికలకు ఉపయోగపడుతుందని నూరిపోసినవారూ ఉన్నారు.
అందరి మన్ననలతోనే ముందుకు !
నాటి నుంచి పార్టీ కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలుచేసుకుంటూ సురేష్‌బాబు ముందుకుపోయారు. ఎక్కడా వర్గాలను ప్రోత్సహించలేదు. మొదటి నుంచి పార్టీ కోసం ఒక కార్యకర్తగానే కష్టపడుతూ వచ్చారు. అందరినీ కలుపుకొంటూనే వెళ్లారు. ప్రభుత్వ కార్యక్రమమైనా, పార్టీ కార్యక్రమమైనా ముందుండేవారు. ఎవరు పిలిచినా వెళ్లేవారు. జిల్లాలో ఉన్న ముఖ్య నాయకులందరితోనూ మంచి సంబంధాలు కొనసాగించారు. అవే.. ఇప్పుడు సురేష్‌బాబుకు కలిసివచ్చాయి. ఆ మంచితనంతోనే తన అభ్యర్థిత్వాన్ని ఎవరూ కాదనలేకపోయారు. పెద్దాయన సాంబశివరాజు పట్ల జగన్‌కు ఉన్న అభిమానం, విజయనగరంలో క్షత్రియ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలన్న ఉద్దేశంతో సురేష్‌బాబువైపే జగన్ మొగ్గు చూపారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. దీంతో నెల్లిమర్ల నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఎమ్మెల్సీగా తనకు మరోసారి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి జగన్‌కు, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలందరికీ సురేష్‌బాబు కృతజ్ఞతలు తెలియజేశారు.