CM Jagan On Anantapur Tragedy :   అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండలంలో జరిగిన విద్యుత్ తీగ తెగిపడిన ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు సీఎం జగన్ రూ. పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. గాయపడిన వారికి బళ్లారి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. నష్టపరిహారం విషయాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నారు. వెంటనే మృతుల కుటుంబాలకు రూ. పది లక్షల సాయం అంద చేయడంతో పాటు గాయపడిన వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తామన్నారు. ఈ ఘటన విషయంలో విద్యుత్ పంపిణీ సంస్థలకు చెందిన ఏడీఈ, ఏఈ, లైన్ ఇన్స్‌పెక్టర్‌లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఎలక్ట్రిసిటీ సేఫ్టీ డైరక్టర్‌కు ఆదేశాలిచ్చారు. నివేదిక ఆధారంగా ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోనున్నారు. డిస్కమ్‌లు వీలైనంత త్వరగా నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. 


ట్రాక్టర్‌పై పడిన విద్యుత్ తీగలు 


దర్గా హోన్నూర్ గ్రామంలో ఘోర విద్యుత్ ప్రమాదం చోటుచేసుకుంది విద్యుత్ తీగలు మీద పడటంతో నలుగురు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు.  ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్న మరో ముగ్గురు కూలీలను బళ్లారి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మరోక మహిళ మృతి మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానికులు తెలిపారు. బాధితులు అందరూ హోన్నూరు గ్రామం ఎర్రనాల కాలనీవాసులుగా గుర్తించారు. 


జూన్‌లో ఇదే తరహా ప్రమాదంలో ఐదుగురు కూలీలు మృతి 


జూన్‌లో  సత్యసాయి జిల్లా  తాడిమర్రి మండలం గుడ్డంపల్లి గ్రామానికి చెందిన కూలీలు.. చిల్లకొండయ్యపల్లి గ్రామ సమీపంలో కూలి పనులకు ఆటోలో వెళ్తున్న సమయంలో  హై టెన్షన్ విద్యుత్   తీగలు ఒక్కసారిగా తెగి ఆటో మీద తెగిపడ్డాయి.  ఆటో మొత్తం దగ్ధమైపోతోంది..  ఐదు నిండు ప్రాణాలు నిలువునా మంటల్లో కాలి బూడిదయ్యాయి . ప్రమాద సమయంలో మొత్తం డ్రైవర్‌ తో కలిపి 13 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. వీరిలో డ్రైవర్‌ పోతులయ్య, మరో ఏడుగురు కూలీలు మాత్రమే గాయాలతో బయటపడ్డారు. ఆ దుర్ఘటనలో మరణించిన వారంతా మహిళలే. మృతులను గుడ్డంపల్లి, పెద్దకోట్ల గ్రామస్తులు . ఇప్పుడు అలాంటిదే మరో ప్రమాదం చోటు చేసుకుంది. 


వరుస ప్రమాదాలకు కారణం ఏమిటి ?


విద్యుత్ సరఫరాకు  నాణ్యతలేని వైర్లు వాడుతున్నారన్న ఆరోపణలు చాలా కాలంగాఉన్నాయి.  హైటెన్షన్ తీగలకు బదులుగా లోటెన్షన్స్ తీగలు వేయడం, ఇన్సులేటర్లు, కండక్టర్లు వంటి వాటి ప్రమాణాలను తగిన రీతిలో పరీక్షించడం లేదని అందుకే ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.  ప్రైవేటు కాంట్రాక్టర్లు  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అధికారులతో కుమ్మక్కయి.. ఇలాంటి నాసిరకం వైర్లను సరఫరా చేయడం వల్ల... ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు. అయితే దీనిపై  ఇంత వరకూ ఎలాంటి విచారణ జరగడం లేదని.. వైర్ల నాణ్యతపై ఎలాంటి పరిశీలన చేియంచడం లేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  ఘటన జరిగినప్పుడు పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారని విమర్శిస్తున్నారు.