CM jagan Review : మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలు తేదీలు పై అ సీఎంఓ అధికారులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు..అసెంబ్లీ సమావేశాలు, మార్చి, ఏప్రిల్ నెలలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, అమలు చేయాల్సిన పథకాల తేదీల ను ఈ సందర్బంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన పలు కార్యక్రమాలను గురించి అధికారులు సీఎం కు వివరించారు. ఎన్నికల కోడ్ ముగియనుండడంతో ఆయా కార్యక్రమాలు, పథకాల అమలుకు ప్రభుత్వం సన్నాహాలు చేయాలన్నారు. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేని కారణంగా మార్చి 10 నుంచి మధ్యాహ్న భోజనంతో పాటుగా రాగిజావ అమలు ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
మార్చి 14 నుంచి అసెంబ్లీలో సమావేశాల నిర్వహణకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. బీఏసీ లో సమావేశాల షెడ్యూలు ఖరారు అవుతుందని అందుకు అవసరం అయిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సూచించారు. మార్చి 18 సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం… జగనన్న విద్యాదీవెన కింద నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి డీబీటి పద్ధతిలో జమ చేయనున్నారు. మార్చి 22 ఉగాది రోజున ఉత్తమ సేవలందించిన వాలంటీర్ల పేర్ల ప్రకటన జరుగుతుందని, వీరికి ఏప్రిల్ 10న అవార్డులు, రివార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. మార్చి 23న జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మార్చి 25 నుంచి ప్రారంభం వైఎస్సార్ ఆసరా పథకం నిధులను జమ చేస్తారు. ఏప్రిల్ 5 వరకూ ఈ పథకం అమలు కొనసాగుతుందని ప్రకటించారు. మార్చి 31న జగనన్న వసతి దీవెన, ఏప్రిల్ 6న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు, ఏప్రిల్ 10న వాలంటీర్లకు సన్మానం, ఏప్రిల్ 18న ఈబీసీ నేస్తం నిర్వాహణకు ఏర్పాట్లు చేయాలని సీఎంవో అదికారులకు జగన్ ఆదేశాలు ఇచ్చారు.
ఈ నెల 14 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల జరగబోతున్నాయి. పది రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. కొన్ని కీలక అంశాలకు సంబంధించి అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ మాట్లాడనున్నారని ఇప్పటికే ముందస్తు సమాచారం అందింది. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఇటీవలే బాధ్యతలను స్వీకరించిన గవర్నర్ తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ,మండలి సభలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరుగుతుంది. బడ్జెట్ ఎప్పుడు పెడతారు అనేది బీఏసీ లో నిర్ణయం తీసుకుంటారు. అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ మూడు రాజధానులు... రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి . సంక్షేమ పథకాలకు సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది.
ఎన్నికలకు ముందు జరిగే బడ్జెట్ సమావేశాలు కాబట్టి ఈ సారి కొన్ని రంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు . .వ్యవసాయ విద్య వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే విధంగా మహిళలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నాయని వైఎస్ఆర్‌సీపీ వర్గాలు చెబుతున్నాయి. .ఈ సారి కూడా టీడీపీ కూడా కీలక అంశాలకు సంబంధించి అసెంబ్లీ లో చర్చ లెవనెత్తే పరిస్థితి కనిపిస్తోంది. పెరిగిన ధరలు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఇతర అంశాలపై టీడీపీ చర్చ కు పట్టు బట్టే అవకాశాలు ఉన్నాయి .