CM Chandrababu Review On Vijayawada Floods: గత 10 రోజులుగా వరదలతో అతలాకుతలమైన విజయవాడ (Vijayawada) నగరం ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తోంది. మంగళవారం సాయంత్రంలోపు పూర్తిగా పరిస్థితిని చక్కదిద్దాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధికారులను ఆదేశించారు. విజయవాడ కలెక్టరేట్‌లో సోమవారం అర్ధరాత్రి వరకూ ఆయన సమీక్ష నిర్వహించారు. వరదలపై యుద్ధం తుది దశకు వచ్చిందని.. పూర్తిగా చక్కదిద్దిన అనంతరం ఇతర పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అటు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా ఆయా ప్రాంతాల మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. క్షేత్రస్థాయిలో తిరిగి సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదిక సమర్పించాలని నిర్దేశించారు.


సహాయక చర్యలపై..


ముంపునకు గురైన 32 వార్డుల్లో 26 చోట్ల సాధారణ స్థితి నెలకొందని.. 3 షిఫ్టుల్లో పురపాలక సిబ్బంది పారిశుద్ధ్య పనులు చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. 95 శాతం విద్యుత్ పునరుద్ధరణ జరిగిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. ఇంకా 6 డివిజన్లలో నీరు నిలిచి ఉందని మంగళవారం సాయంత్రం సాధారణ స్థితికి వస్తే పూర్తిస్థాయిలో విద్యుత్ పునరుద్ధరిస్తామని పేర్కొన్నారు. ఆప్కో, ఇతర సంస్థల నుంచి దుస్తులు తెప్పించి సర్వం కోల్పోయిన బాధితులకు పంచే ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. 2.75 లక్షల మంది ముంపునకు గురైనందున వారి కష్టాలు తీర్చాలన్నారు. అర్బన్ కంపెనీ సాయంతో పాడైన వస్తువులు బాగు చేయించడం, యాప్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచడంపై మంత్రులకు చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. అటు, సహాయక చర్యల పర్యవేక్షణకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇచ్చారు.


అటు, కొల్లేరు వరద కారణంగా లంక గ్రామాల్లో ముంపు కొనసాగుతోంది. పెదఎడ్లగాడి వంతెన వద్ద సోమవారం వరద 3.41 మీటర్లకు పెరిగింది. కైకలూరు, ఏలూరు నియోజకవర్గాల్లోని పలు గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ నుంచి బుడమేరు ద్వారా పెద్దఎత్తున కొల్లేరుకు వరద చేరుతోంది. దీంతోపాటు తమ్మిలేరు, రామిలేరుతో పాటు మరో 20 డ్రెయిన్ల నుంచి వరద కొల్లేరు వైపు పరుగులు తీస్తోంది.


ఉత్తరాంధ్రలో వర్ష బీభత్సం


మరోవైపు, భారీ వర్షాలకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారడంతో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వరద నీటి ఉద్ధృతికి పలుచోట్ల రహదారులు తెగిపోయాయి. కల్వర్టులు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జలాశయాలకు వరద పోటెత్తడంతో నీటి మట్టాలు ప్రమాద స్థితికి చేరుకున్నాయి. విశాఖ, అనకాపల్లి జిల్లాల పరిధిలో పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. జీకే వీధి మండలం చట్రాయిపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కొండ చరియలు విరిగి పడడంతో కొన్ని ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు ఉత్తరాంధ్రలో అత్యధికంగా అల్లూరి జిల్లా వై.రామవరంలో 14 సెం.మీ, చింతపల్లి 13.7 సెం.మీ, గంగవరం 12.6, ముంచంగిపుట్టు 12.1, విజయనగరం జిల్లా గోవిందపురం 13.9, పెదనందిపల్లి 12.3, అనకాపల్లి జిల్లా కృష్ణదేవిపేట 13.1, శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరంలో 11.5 సెం.మీల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.


Also Read: Srikakulam : శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తమ్మినేని! విరుగుడు చర్యలు చేపట్టిన కృష్ణదాస్