CM Chandrababu Postponed Electricity Bill Payments In Vijayawada: విజయవాడలోని (Vijayawada) వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా వరద అడుగుల మేర నిలిచి ఉంది. వరద తగ్గిన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేసింది. ఫైరింజన్ల సాయంతో రహదారులు, ఇళ్లు, షాపుల్లో బురదను సిబ్బంది తొలగిస్తున్నారు. అటు, పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు సరఫరా కొనసాగుతోంది. మరోవైపు, ముంపు ప్రాంతాల్లో కరెంట్ బిల్లుల చెల్లింపుపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) కీలక ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఇబ్బందుల దృష్ట్యా వారు వచ్చే నెల కట్టుకోవచ్చని తెలిపారు. మరోవైపు, బాధిత ప్రాంతాల్లోని ఇళ్లల్లో ఎలక్ట్రిక్ వస్తువులు పాడేపోయినందున.. ప్రతి ఇంటికీ ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మెకానిక్ అవసరం కాబట్టి.. వారు ఇష్టానుసారంగా వసూలు చేయకుండా చూస్తామని చెప్పారు. ఓ ధర నిర్ణయిస్తామని.. అవసరమైతే రాయితీ ఇస్తామని పేర్కొన్నారు. ఆన్ లైన్‌లో నమోదు చేసుకుంటే ఇంటికే సర్వీసులు అందిస్తామని స్పష్టం చేశారు.
డ్రోన్లతో బ్లీచింగ్ స్ప్రే
మరోవైపు, వరద తగ్గిన ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ఫైరింజన్ల సాయంతో బురదను తొలగిస్తున్నారు. దాదాపు వందకు పైగా ఫైరింజన్లను అందుబాటులో ఉంచారు. రహదారులు, షాపులు, ఇళ్లల్లో బురదను తొలగిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి దాదాపు 2 వేల మందికి పైగా మున్సిపల్ సిబ్బంది చెత్తా చెదారాన్ని తొలగిస్తున్నారు. వరద తగ్గిన వెంటనే అంటువ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు చేపడుతున్నారు. బురదతో పూర్తిగా క్లీన్ చేసిన ప్రాంతాల్లో డ్రోన్లతో బ్లీచింగ్ లిక్విడ్ స్ప్రే చేస్తున్నారు. అటు, ఇంకా కొన్ని చోట్ల పునరావాస కేంద్రాలు కొనసాగుతుండగా బాధితులకు ఆహారం, తాగునీరు.. అవసరమైన వారికి మెడిసిన్స్ అందిస్తున్నారు.
సీఎం ఏరియల్ సర్వే
అటు, నగరంలోని వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) శుక్రవారం ఏరియల్ సర్వే (Aerial Survey) నిర్వహించారు. వరదలకు మూల కారణమైన బుడమేరు (Budameru) డ్రైన్, కొల్లేరు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వరద ప్రవాహం, ముంపు, గండ్లు పడిన ప్రాంతాలను సర్వే చేశారు. ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణా నదీ ప్రవాహాన్ని పరిశీలించారు. అంతకుముందు నగరంలో కొనసాగుతోన్న వరద సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరదలకు ఇళ్లల్లో చెడిపోయిన ఎలక్ట్రిక్ వస్తువులను రిపేర్ చేయించేందుకు నిపుణులను పిలిపించాలని సూచించారు. మరోవైపు, బుడమేరు గండ్ల పూడ్చివేతకు భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఇప్పటికే యుద్ధ ప్రాతిపదికన రెండు గండ్లు పూడ్చేశారు. మైలవరం నియోజకవర్గం కొండపల్లి కవులూరు వద్ద మూడో గండిని శుక్రవారం సాయంత్రం వరకూ పూడ్చేందుకు చర్యలు చేపట్టారు. గండ్లు పూడ్చడం పూర్తైతే నగరానికి వరద ప్రవాహం తగ్గనుంది.