CM Chandrababu Naidu launches free bus scheme in AP: సూపర్ సిక్స్ హామీల్లో అత్యంత కీలకమైన హామీ అయిన మహిళలకు ఉచితబస్సు పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఉండవల్లి నుంచి విజయవాడ బస్టాండ్ వరకూ బస్సులో ప్రయాణించారు. చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒకే బస్సులో ప్రయాణించారు. వారితో పాటు మహిళా ప్రయాణికులు కూడా ఉండవల్లి నుంచి విజయవాడ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రయాణికులతో చంద్రబాబు, లోకేష్, పవన్ మాట్లాడుతూ కనిపించారు.
ఉచితంగా ప్రయాణం చేయాలంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ మహిళలై ఉండాలి. అందుకు తగిన ప్రూఫ్ మీరు చూపించాలి. అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు ఇలా ఏదో ఒక మీ ఫొటో ఉన్న గుర్తింపు కార్డు కండక్టర్‌కు చూపించిన తర్వాతే టికెట్ ఇస్తారు. పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, సిటీ బస్‌లు, ఎక్స్‌ప్రెస్‌లలో మాత్రమే ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ బస్‌లలో మాత్రమే జీరో ఫెయిర్ టికెట్ ఇస్తారు. ఇంద్రా ఏసీ, సూపర్ లగ్జరీ, ఆల్ట్రా డీలక్స్, ఇతర రాష్ట్రాలకు నడిపే సర్వీస్‌లకు ఉచిత పథకం వర్తించదు .
హిందూపురం ఆర్టీసీ డిపో లో మహిళలకు స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రారంభించారు. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణపు టికెట్ ఇచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి బస్సును డ్రైవింగ్ చేసుకుంటూ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు వెళ్లారు.
ఉచిత బస్సు పథకం వల్ల విద్య, ఉద్యోగం, చిరు వ్యాపారాలు చేసే మహిళలకు ప్రయాణ ఖర్చులు కలసి వస్తాయి. ఎనిమిదివేలకుపైగా బస్సులు ప్రయాణం కోసం సిద్ధం చేశారు. మరికొన్ని బస్సులను డిమాండ్ ను బట్టి సిద్ధం చేస్తారు. మొదట్లో డిమాండ్ ఉంటుందని.. తర్వాత పరిస్థితిని బట్టి బస్సులను పెంచాలని భావిస్తున్నారు.