CM Chandrababu expressed dissatisfaction on ministers: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల హెడ్స్ ఆఫ్ డిపార్ట్‌మెంట్స్ , సెక్రటరీలతో జరిగిన సమావేశంలో మంత్రులు 18 నెలలు అయినా పనితీరులో మార్పు చూపలేదని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల నిధులు తీసుకురావడంలో మంత్రులు విఫలమవుతున్నారని విమర్శించారు. ఢిల్లీకి అధికారులతో కలిసి వెళ్లి సంబంధిత పథకాలకు నిధులు తీసుకురండి. మంత్రులు ఒక్క రోజు ఢిల్లీకి వెళ్లడంలో ఏమీ నష్టం లేదు అని సీఎం సూచించారు. ఇకనైనా పనితీరు మార్చుకోవాలని మంత్రులకు హెచ్చరిక జారీ చేశారు.
కేంద్ర పథకాల నిధుల్ని సమర్థంగా వినియోగించుకోలేకపోతున్న మంత్రులు
సమావేశంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఆలస్యం చేస్తున్నారని, ఇది ప్రభుత్వ పనితీరును దెబ్బతీస్తోందన్నారు. మీలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రజలు మన పాలనపై నమ్మకం పెట్టుకుని ఓటు వేశారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలంటే మంత్రులు దూకుడుగా పని చేయాలన్నారు. కేంద్ర పథకాలు – PM Awas Yojana, Ayushman Bharat, PMAY Urban వంటి వాటికి నిధులు వచ్చేలా మంత్రులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
మంత్రులకు పలు సూచనలు చేసిన సీఎం
మంత్రులు, ఎమ్మెల్యేలు నెలలో 4 రోజులు పల్లెల్లో పల్లె నిద్ర చేయాలి. గ్రామాల్లో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి. పల్లె వెలుగు, స్వర్ణ గ్రామం పేరుతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. అయితే ఫలానా మంత్రి అని సీఎం చంద్రబాబు చెప్పలేదు. మంత్రుల జాబితాలో పవన్ కల్యాణ్, నారా లోకేష్ కూడా ఉంటారు. వారికి కూడా చంద్రబాబు ఈ హెచ్చరికలు చేసినట్లేనని చెబుతున్నారు. అయితే అందరి పనితీరు బాగోలేదని జనరల్ గా చెప్పారని కానీ నారా లోకేష్, పవన్ కల్యాణ్ తమ శాఖలకు చెందిన కేంద్ర నిధుల కోసం తరచూ ఢిల్లీకి వెళ్లడం లేదా అధికారుల్ని పంపడం ద్వారా గరిష్టంగా నిధులు సేకరిస్తున్నారని అంటున్నారు.
తమ శాఖల నిధుల కోసం తరచూ ఢిల్లీ వెళ్తున్న పవన్, లోకేష్
పవన్ కల్యాణ్ ఇటీవల పంచాయతీరాజ్ శాఖలో పల్లె పండుగ 2.0ని ప్రారంభించారు. పెద్ద ఎత్తున పనులను ప్రారంభించారు. నారా లోకేష్ విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చి కేంద్ర నిధుల్ని ఎప్పటికప్పుడు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇతర శాఖల మంత్రులే పెద్దగా చొరవడం చూపడం లేదని అంటున్నారు. ఈ సమావేశం మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం పెంచడానికి, పాలనా వ్యవస్థను మరింత దృఢపరచడానికి ఏర్పాటు చేశారు.