Mylavaram News :  ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.  రెడ్డిగూడెం గ్రామంలో రహదారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ వసంత కృష్ణ ప్రసాద్ హాజరయ్యారు.  అయితే ఆ రోడ్ కేంద్ర ప్రభుత్వ నిధులతో... ఎంపీ కేశినేని నాని మంజూరు చేయించడంతో ఆయన ప్రారంభించాల్సి ఉంది. ఈ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. అనుకున్న సమయానికి ఎమ్మెల్యే కార్యక్రమం వద్దకు చేరుకున్నా ఎంపీ కేశినేని నాని మాత్రం రాలేదు.  40నిమిషాలు వేచి చూసిన తర్వాత ఎంపీ వచ్చారు. ఎండగా ఉండటంతో..  కార్యకర్తలు కుర్చీ తీసుకురావడంతో చెట్టు క్రిందే కూర్చుని ఎంపీ కోసం ఎదురు చూశారు ఎమ్మెల్యే. 


సుమారు గంట తర్వాత రహదారి ప్రారంభ కార్యక్రమానికి  ఎంపీ కేశినేని నాని హాజరయ్యారు.  నాని కాన్వాయ్ తో పాటు భారీగా చేరుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు. అప్పటికే కృష్ణ ప్రసాద్ వెంట ఆయన అనుచరులు రావడంతో.. ఇరు వర్గాలు ఎదురుపడినట్లయింది. దీంతో రెండు పార్టీల నేతలు  జెండాలు ఎగురవేస్తూ పార్టీలకు తమ నేతలకు అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో  పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చక్కదిద్దే ప్రయత్నం చేశారు.   గందరగోళం మధ్యే రహదారి ప్రారంభ కార్యక్రమాన్ని పూర్తిచేసిన ఎమ్మెల్యే వసంత,ఎంపీ కేశినేని నాని వెళ్లిపోాయరు. పోలీసులు ఘర్షణలు జరిగే అవకాశం ఉందని.. ఎవరి అనుచరుల్ని వారు తీసుకెళ్లిపోవాలని సూచించడంతో..  తీసుకెళ్లిపోయారు. దీంతో పరిస్థితులు సద్దుమణిగాయి.  


బుధవారం తిరువూరులో ఎంపీ నాని పాల్గొన్న సమావేశంలోనూ ఉద్రిక్తత ఏర్పడింది.    తిరువూరులో కేశినేని నాని, కేశినేని చిన్ని వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ నెల 7న చంద్రబాబు (Chandrababu) తిరువూరులో పర్యటించనున్నారు. అక్కడ నిర్వహించే భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. దీంతో సభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సభను విజయవంతం చేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.                            


ఈ ఫ్లెక్సీల్లో కేశినేని ( Kesineni Nani ) ఫొటో లేకపోవడంతో ఆయన వర్గం నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేశినేని చిన్ని ఫ్లెక్సీలను చించివేశారు. కేశినేని చిన్నినీ సమావేశానికి రానివ్వమంటూ గేటు వద్ద కేశినేని నాని వర్గం ఆందోళనకు దిగింది. తిరువూరు టీడీపీ ఇంచార్జి దత్తుపై నాని వర్గం దాడికి దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నియోజకవర్గ ఇంఛార్జ్ దత్తుపై కూడా నాని వర్గం ఆందోళనకు దిగింది. కొద్దిసేపటికి వేలాదిమందితో కేశినేని చిన్ని ర్యాలీగా వచ్చారు. ఇరు వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ దశలో పార్టీ కార్యాలయంలోని రూంలో ఎంపీ కేశినేని నాని కూర్చున్నారు. కేశినేని నాని, గద్దె రామ్మోహన్ బయటకు రావాలని కార్యకర్తలు తలుపులు బాది నినాదాలు చేశారు.