Chandrababu Bail: స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. కొన్ని షరతులతో చంద్రబాబుకు నాలుగు వారాల పాటు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష సెక్యూరిటీ బాండ్, రెండు ష్యూరిటీలతో బాబుకు హైకోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టులో ఇచ్చిన బెయిల్ ఆర్డర్స్ రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్నారు. దీంతో కాసేపట్లో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్నారు. చంద్రబాబు కోసం జైలు వద్ద కుటుంబసభ్యులు, టీడీపీ కార్యకర్తలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జైలు వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకోగా.. టపాసులు పేల్చి సంబురాలు చేసుకుంటున్నారు.


ఈ క్రమంలో హైకోర్టులో సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఆంక్షలు విధించాలని పిటిషన్ వేసింది. రాజకీయ కార్యకలాపాల్లో చంద్రబాబు పాల్గొనకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును సీఐడీ కోరింది. మీడియాతో మాట్లాడటం, ఇంటర్వ్యూలు ఇవ్వకుండా బెయిల్‌పై ఆంక్షలు విధించాలంటూ సీఐడీ పిటిషన్‌లో పేర్కొంది. అనారోగ్య కారణాల వల్ల మధ్యంతర బెయిల్ ఇచ్చారని, కేవలం చికిత్సకు మాత్రమే చంద్రబాబు పరిమితమయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొంది. దీనిపై త్వరలో విచారణ జరగనుంది.


అయితే చంద్రబాబు జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో జైలు చుట్టపక్కల పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు. రాజమండ్రి సెంట్రల్ నుంచి రోడ్డు మార్గం ద్వారా ర్యాలీగా విజయవాడకు చంద్రబాబు చేరుకోనున్నారు. ఈ ర్యాలీలో భారీగా టీడీపీ శ్రేణులు పాల్గొననున్నారు. ర్యాలీకి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తవ్వగా.. రూట్ మ్యాప్‌ను టీడీపీ సిద్దం చేసింది. పలు నియోజకవర్గాలను కవర్ చేసేలా బాబు రూట్‌మ్యాప్‌ను సిద్దం చేశారు. ఈ రోజు రాత్రికి చంద్రబాబు విజయవాడలోని తన నివాసానికి చేరుకోనున్నారు. అనంతరం రేపు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు.


తిరుపతి నుంచి నేరుగా చంద్రబాబు హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో కంటి చికిత్స తీసుకుంటారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇక మద్యం కేసులోనూ చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించింది. చంద్రబాబును అరెస్ట్ చేయబోమని హైకోర్టుకు ఏపీ అడ్వకేట్ జనరల్ తెలిపారు. స్కిల్ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ పూర్తయ్యేవరకు మద్యం కేసులో అరెస్ట్ చేయబోమని చెప్పారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణను నవంబర్ 21వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అక్రమంగా మద్యం తయారీ కంపెనీలకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలతో చంద్రబాబుపై సోమవారం సీఐడీ కేసు నమోదైంది. ఈ కేసులో ఏ3గా చంద్రబాబును చేర్చింది. 


ఈ క్రమంలో మద్యం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై మధ్యాహ్నం విచారణ జరిగింది. ఈ కేసులోనూ చంద్రబాబుకు ఊరట లభించడంతో టీడీపీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. అటు స్కిల్ కేసులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై నవంబర్ 8లోపు తీర్పు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశంలోనూ చంద్రబాబుకు ఊరట దక్కుతుందని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తోన్నారు.