APCMO Arrests :  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో భారీ స్కాం వెలుగులోకి వచ్చింది.  ముఖ్యమంత్రి డిజిటల్ సంతకాలను  ..సీఎంకు తెలియకుండా దుర్వినియోగం చేసిన కేసులో సీఐడీ ఐదుగుర్ని అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను   సైబర్ క్రైమ్ సీఐడి ఎస్పీ హర్ష వర్ధన్ రాజు వెల్లడించారు.  కొందరు కార్యదర్శుల డిజిటల్ సంతకాలను దుర్వినియోగం చేసి ‘సీఎం పిటిషన్‌’లు జారీ చేసినట్లు తెలిపారు. ఒక్కో ఫైల్‌కు ₹30 వేల నుంచి ₹50 వేల వరకూ వసూలు చేశారన్నారు. ఏప్రిల్ నుంచి 3 నెలలలో 66 సీఎంపీలు జారీ చేసిన నిందితులు.. మొత్తం ₹15 లక్షల వరకూ నిందితులు వసూలు చేసినట్లు చెప్పారు. అయితే, ఏ ఫైల్‌కూ తుది ఆమోదం రాలేదని.. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ చేస్తున్నామన్నారు.                                   


 డాక్టర్లు, టీచర్‌ల బదిలీకి సంబంధించిన ఫైల్స్‌కు  సీఎంపీలు జారీ చేశారని.. సీఎం పేషీలోని కార్యదర్శి భరత్ గుప్తా మొదట ఈ డిజిటల్ సంతకాల టాంపరింగ్ చేసినట్టు గుర్తించి ఫిర్యాదు చేశారన్నారు.  సీఎంవో ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య డిజిటల్ సంతకం దొంగిలించి సీఎంపీలు జారీ చేశారని తెలిపారు.   ఈ వ్యవహారంపై తదుపరి విచారణ చేస్తున్నామని   ఎస్పీ హర్ష వర్ధన్ రాజు వెల్లడించారు.                   


 సీఎం కార్యాలయంలోని అధికారుల అధికారిక లాగిన్‌ వివరాలను తెలుసుకుని తమకు కావాల్సిన ఫైళ్లకు ఉన్నతాధికారులకు తెలియకుండా డిజిటల్‌ సిగ్నేచర్‌ ద్వారా అప్రూవల్‌ ఇచ్చేసినట్లుగా కొంత కాలం కిందట వెలుగులోకి వచ్చారు. ఈ అంశం సీఎంవో మఖ్య కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డి దృష్టికి వచ్చింది. సీఎంపీల ఫోర్జరీ, ఉన్నతాధికారుల లాగిన్‌ వివరాల దుర్వినియోగంలో తన పేషీలోని అటెండర్‌ ,   డేటా ఎంట్రీ ఆపరేటర్ల పాత్ర ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు.  అయితే సీఎం వోకు సంబంధించిన అంశం కావడంతో ప్రజల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉండటంతో కేసునుసీఐడీకి అప్పగించారు. 


మరోవైపు ఏపీ సీఎంవోలో డిజిటల్ సంతకాల దుర్వినియోగంపై విపక్షాలు ఇప్పటికే జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రికి తెలియలేదని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు సాగిస్తోంది. ఇప్పటికే అరెస్టు చేసిన ఐదుగురు నిందితుల్ని కోర్టులో హాజరు పర్చి రిమాండ్ కూడా తరలించినట్లు తెలుస్తోంది. వీరిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే తదుపరి వివరాలు బయటపడే అవకాశాలున్నాయి.


సీఎంవోలో డిజిటల్ సంతకాన్ని డేటాఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు ఉపయోగించి.. సీఎంపీలు జారీ చేసే పరిస్థితి ఉండదని.. దీని వెనుక పెద్ద తలకాయలు ఉన్నారన్న ఆరోపణలుకూడా వస్తున్నాయి. అయితే సీఐడీ అరెస్ట్ చేసిన ఐదుగురు.. అటెండర్ ఆ స్థాయి ఉద్యోగులే. అందుకే.. ఈ కేసు వెనుక కొన్ని కీలకమైన విషయాలు దాగి ఉన్నాయన్న ఆరోపణలు రావడానికి కారణం అవుతోంది.