CID conducts searches at Bharathi Cements in Hyderabad:  ఏపీ లిక్కర్ స్కామ్‌లో సీఐడీ అధికారులు హైదరాబాద్‌‌లో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు.  బంజారాహిల్స్ లోని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో డాక్యుమెంట్లు పరిశీలించారు.  భారతి సిమెంట్స్ కేంద్రంగా ఏపీ లిక్కర్ స్కామ్ నడిచిందని అనుమానాలు ఉన్నాయి.  ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన బాలాజీ గోవిందప్ప భారతి సిమెంట్ లో డైరెక్టర్ గా ఉన్నారు.  రూ.3,500 కోట్ల స్కామ్ వ్యవహారంలో కొనసాగుతున్న విచారణలో ..  హైదరాబాదులో ఆరు డెన్లకు భారతి సిమెంట్స్ నుండి ముడుపులు తరలించినట్లు గుర్తించారు.  భారతీ సిమెంట్స్ లో మద్యం సరఫరా కంపెనీలు, డిస్టలరీల యజమానులతో సమావేశాలు జరిగాయని..  సమావేశాలు అనంతరం ముడుపులను భారతీ సిమెంట్స్ కంపెనీలో అందజేసినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు.

బాలాజీ, మద్యం సరఫరా కంపెనీలు,  డిస్టిలరీల నుండి నెలవారీ ముడుపులు  సేకరించే వ్యవస్థను రూపొందించినట్లు SIT దర్యాప్తులో తేలింది. ఈ ముడుపులు నెలకు సుమారు రూ. 50-60 కోట్ల వరకు ఉండేవని, ఇవి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి  ద్వారా బాలాజీ గోవిందప్ప, విజయ్ సాయి రెడ్డి  , మిథున్ రెడ్డి, ఇతరులకు  చేరేవని సీఐడీ అధికారులు చెబుతున్నారు.   బాలాజీ గోవిందప్ప  చార్టర్డ్ అకౌంటెంట్‌గా తన ఆర్థిక నైపుణ్యాన్ని ఉపయోగించి, మద్యం కుంభకోణం నుండి వచ్చిన నిధులను షెల్ కంపెనీల ద్వారా బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ షెల్ కంపెనీలు కేవలం కాగితాలపై మాత్రమే ఉన్నాయని, వీటిని మద్యం ముడుపులను సురక్షిత స్థానాలకు బదిలీ చేయడానికి ఉపయోగించారని SIT తెలిపింది.  ఈ నిధులు హవాలా లావాదేవీలు , బంగారం కొనుగోళ్ల ద్వారా  లాండరింగ్ చేసినట్లుగా సీఐడీ గుర్తించింది. 

 వైఎస్ జగన్ భార్య భారతి తరపున ఆర్థిక లావాదేవీలను బాలాజీ గోవిందప్ప నిర్వహించినట్లు SIT రిమాండ్ రిపోర్ట్‌లో  వెల్లడించింది.  ఆయన భారతి సిమెంట్స్‌లో పూర్తికాల డైరెక్టర్‌గా ఉంటూ, ఆర్థిక వ్యవహారాలు , కొనుగోళ్లు, ఐటీ కార్యకలాపాలను నిర్వహించారు.  2025 మే 13న, బాలాజీ గోవిందప్పను కర్ణాటకలోని మైసూరు సమీపంలోని బీఆర్ హిల్స్‌లోని ఒక వెల్‌నెస్ సెంటర్‌లో SIT అరెస్ట్ చేసింది. అతను SIT సమన్లను నిర్లక్ష్యం చేసి పరారీలో ఉండటంతో అరెస్టు చేశారు.  అరెస్ట్‌కు ముందు, హైదరాబాద్‌లోని అతని నివాసంలో మే 10, 2025న SIT శోధనలు నిర్వహించింది.

బాలాజీ బంధువు  శ్రీనివాసులు, YSRCP ప్రభుత్వ హయాంలో చిత్తూరు జడ్పీ చైర్మన్‌గా నియమితులయ్యారు. బాలాజీ గోవిందప్ప ఇంకా జైల్లోనే ఉన్నారు.   భారతి సిమెంట్స్ కు .. వైఎస్ జగన్ భార్య భారతి యజమానిగా ఉన్నారు. నిజానికి ఈ కంపెనీలో అత్యధిక భాగం అంటే 51 శాతం వాటాను ఫ్రాన్స్ కు చెందిన కంపెనీ వికాట్ కు అమ్మేశారు.  అయినప్పటికీ ఈ ఫ్యాక్టరీ నిర్వహణ ఇంకా వైఎస్ జగన్ కుటుంబీకుల చేతుల్లోనే ఉంది. ఈ కంపెనీలోకి లిక్కర్ స్కామ్ సొమ్ము ప్రవహించినట్లుగా తెలడంతో సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది.