CI Anju Yadav: ఇటీవలే శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్.. జనసేన కార్యకర్త కొట్టే సాయిపై చేయి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో సీఐ అంజూ యాదవ్ పై తీవ్ర విమర్శలు రాగా.. తాజాగా మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించింది. సదరు సీఐకి నోటీసులు జారీ చేసింది. సమోటోగా కేసు నమోదు చేసుకొని ఈనెల 27వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు కూడా జారీ చేసింది.
అసలేం జరిగిందంటే..?
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు దుమారం సృష్టించారు. వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు, వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. దీనికి ప్రతిగా శ్రీకాళహస్తిలో బుధవారం జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కళ్యాణ మండపం సమీపంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టె సాయి మహేష్‌తో పాటు ఇతర నాయకులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకుని నాయకులందరినీ బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈక్రమంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సీఐ అంజూ యావద్.. జనసేన నాయకుడు కొట్టె సాయిపై చేయి చేసుకున్నారు. రెండు చెంపలను చెళ్లుమనిపించారు. అక్కడే ఉన్న వారు ఈ వీడియోను తీసి నెట్టింట పెట్టారు. క్షణాల్లోనే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. టీవీ ఛానెళ్లు, వార్తా పత్రికలు.. ఇలా ఇక్కడ చూసిన ఈ వార్తే హైలెట్ అయింది. దీంతో సీఐ అంజూ యాదవ్ చేసిన పనికి జనసేన నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఘటనపై స్పందించింది. సీఐ అంజూ యాదవ్ కు నోటీసులు జారీ చేసింది. ఈనెల 27వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని కోరింది.
శ్రీకాళహస్తికి వచ్చినప్పుడే సంగతేంటో తేల్చుకుంటా..!
జనసేన కార్యకర్త కొట్టె సాయిని సర్కిల్ ఇన్ స్పెక్టర్ సీఐ అంజూ యాదవ్ కొట్టడం మంచిది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలో జనసేన కార్యకర్తలు శాంతియుతంగా ధర్నాలు చేసుకుంటుంటే అతణ్ని ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. అయితే, ఈ విషయంలో తాను ఇప్పుడు ఇంక మాట్లాడబోనని, తాను స్వయంగా శ్రీకాళహస్తికి వచ్చి సంగతేంటో తేల్చుకుంటానని స్పష్టం చేశారు.