Chodavaram News : మూడు రాజధానులకు మద్దతుగా చోడవరంలో వైసీపీ విద్యార్థి భేరి నిర్వహించింది. వికేంద్రీకరణకు మద్దతుగా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో పెద్ద సంఖ్యలు విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. వైసీపీ ర్యాలీలో విద్యార్థులు జనసేనకు అనుకూలంగా నినాదాలు చేశారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో వైసీపీ నేతలు షాక్ కు గురయ్యారు. సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. దీంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. 


విద్యార్థుల భవిష్యత్ బాగుంటుంది- కరణం ధర్మశ్రీ


వైసీపీ ప్రభుత్వం వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశారని ఎమ్మెల్యే ధర్మశ్రీ అన్నారు. మూడు రాజధానులు వల్ల అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలనేది వైసీపీ ప్రభుత్వం ఉద్దేశం అన్నారు. అభివృద్ధి కోసమే సీఎం జగన్ విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని భావిస్తున్నారన్నారు. టీడీపీ, జనసేన పార్టీ నేతలు విశాఖను పరిపాలన రాజధానిగా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఇంకా ఎన్నాళ్లు బానిసలుగా ఉండాలన్నారు. విశాఖ రాజధాని అయితే అందరికి ఉద్యోగాలు వస్తాయన్నారు. విశాఖ పరిపాలన రాజధాని అయితే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందన్నారు. 


విద్యార్థి భేరి


ఏపీలో మూడురాజధానులకు మద్దతుగా ఉద్యమాలు కొనసాగుతున్నాయి. తాజాగా చోడవరంలో విద్యార్థి భేరి నిర్వహించారు వైసీపీ నేతలు. వికేంద్రీకరణకు మద్దతుగా , విశాఖ రాజధానిగా కావాలని చోడవరంలో విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో భారీగా హాజరైన విద్యార్థులు వికేంద్రీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు. కొందరు విద్యార్థులు జనసేనకు మద్దతుగా నినాదాలు చేశారు. చోడవరం శివాలయం నుంచి ప్రభుత్వ కాలేజీ వరకూ ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో చోడవరం ఎమ్మెల్యే ధర్మ శ్రీ, అనకాపల్లి ఎంపీ సత్యవతి విశాఖ రాజధాని కోసం మాట్లాడారు. 


రాజధాని ఉద్యమాలు 


రాజధాని విషయంలో ఏపీలో రెండు ఉద్యమాలు నడుస్తున్నాయి.  అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఉద్యమం చేస్తున్నారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకు మహా పాదయాత్ర చేపట్టారు. రైతుల పాదయాత్రకు అడుగడుగునా వైసీపీ నేతల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. నల్ల బెలూన్లులతో, మూడు రాజధానుల మద్దతుగా ఫ్లెక్సీలతో మూడు రాజధానుల మద్దతుదారులు, వైసీపీ నేతలు రైతుల పాదయాత్రకు నిరసన తెలుపుతున్నారు. వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో జేఏసీ ఏర్పాటు చేశారు. ఈ జేఏసీ ఆందోళనలకు వైసీపీ నేతలు మద్దతు తెలుపుతున్నారు. మూడు రాజధానులు కావాలని ఇటీవల విశాఖ గర్జన నిర్వహించారు. 


రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన


మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ నేతలు జిల్లాల్లో భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు చేస్తున్నారు. వికేంద్రీకరణ మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా అస్త్రాలు సంధించారు. విశాఖ గర్జన విజయవంతం అయిందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇటీవల తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన నిర్వహించారు. రాయలసీమకు న్యాయ రాజధానిని తీసుకురావాలని మూడు రాజధానులకు  మద్దతుగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు.