TDP Amarnath Reddy : చిత్తూరు పోలీసులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి మండిపడ్డారు. గురువారం అర్ధరాత్రి టీడీపీ మాజీ మేయర్ హేమలతపైకి జీపుతో దూసుకెళ్లిన పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమరనాథ్ రెడ్డి చిత్తూరు ఎస్పీ రిషాంత్ రెడ్డిని కలిసి విన్నతి పత్రం అందించారు. అనంతరం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మేయర్ కఠారి హేమలతను పరామర్శించారు. ఆసుపత్రి బయటకు వచ్చిన అమరనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మహిళ, మాజీ మేయర్ అని చూడకుండా పోలీసు వాహనంతో గుద్ది హత్య చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మాజీ మేయర్ కటారి అనురాధ దంపతుల హత్య కేసును నిర్వీర్యం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారన్నారు. బాధితులకు అండగా నిలిచి, సాక్షులను రక్షించాల్సిన పోలీసులే బెదిరింపులకు పాల్పడి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.
వైసీపీ పాలనకు చరమగీతం
మేయర్ దంపతుల హత్య కేసులో బాధితులైన మాజీ మేయర్ హేమలతపై అక్రమ కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసం అని అమరనాథ్ రెడ్డి ప్రశ్నించారు. తప్పు చేసిన పోలీసులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, మాజీ మేయర్ కటారి హేమలతను జీపుతో తొక్కించిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ వాళ్లు గంజాయి, అక్రమ మద్యం అమ్మకాలు సాగిస్తుండే అందుకు పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు కనీస మానవత్వం లేకుండా వ్యవహరించారని, ప్రజలను, కార్యకర్తలను కాపాడుకునేందుకు ఎల్లప్పుడూ టీడీపీ ముందు ఉంటుందని, రాబోయే ఒకటిన్నర సంవత్సరం తర్వాత ఏం జరుగుబోతుందో అర్థం చేసుకుని పోలీసులు వ్యవహరించాలన్నారు. వైసీపీ అరాచక పాలనకు ప్రజలు త్వరలోనే చమరగీతం పాడుతారని తెలిపారు.
మాజీ మేయర్ కు తీవ్ర గాయాలు
చిత్తూరు నగరంలో గురువారం అర్ధరాత్రి హైడ్రామా నడిచింది. చిత్తూరు మాజీ మేయర్ పైకి పోలీసులు జీపు దూసుకెళ్లడంతో ఆమెకు తీవ్ర గాయాలైయ్యాయి. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స ఇప్పిస్తున్నారు. చిత్తూరులో రాత్రి 11 సమయంలో స్థానిక సంతపేటలోని మాజీ మేయర్, టీడీపీ నగర అధ్యక్షురాలు అయిన కటారీ హేమలతకు అనుచరుడు అయిన పూర్ణ ఇంటికి పోలీసులు వచ్చారు. అతని ఇంట్లో గంజాయి ఉందంటూ తనిఖీలు చేశారు. అయితే, పోలీసులు తప్పుడు సమచారంతో తన ఇంటికి వచ్చారని పూర్ణ ఆందోళనకు దిగాడు. ఆ విషయం తెలుసుకున్న మాజీ మేయర్ హేమలత తన అనుచరులతో కలిసి పోలీసు జీపు వెనక కూర్చొని నిరసన తెలిపారు. అయినా సరే జీపును రివర్స్ చేసి పోనివ్వమని సీఐ డ్రైవర్‌తో చెప్పారు. దీంతో వాహనం హేమలత కాళ్లపై నుంచి వెళ్లి పోయిందని ఆమెతో పాటు అనుచరులు ఆరోపణలు చేశారు. వెంటనే ఆమె అనుచరులు గాయపడిన హేమలతను ఆసుపత్రికి తరలించారు. తన అత్తమామలైన దివంగత మేయర్ కఠారి అనురాధ, మోహన్ హత్య కేసులో సాక్షులను బెదిరిస్తున్నారని హేమలత సాయంత్రం ఏఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు. వినతి పత్రం కూడా ఇచ్చారు. ఆ వెంటనే మీడియాతో మాట్లాడారు. అది జరిగిన కొద్ది గంటల్లోనే ఇంట్లో గంజాయి పేరుతో పోలీసులు వచ్చారని హేమలత అనుచరులు ఆరోపిస్తున్నారు.