Chittoor News : చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తున్నాయి. పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల దాడులలో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. కుప్పం నియజకవర్గంలో ఏనుగుల గుంపు స్వైర విహారం చేస్తుంది. ఎటు చూసిన ఏనుగుల దాడులే కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని కుప్పం పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శనివారం ఏనుగుల గుంపు దాడిలో తిమ్మప్ప అనే రైతు మృతి చెందాడు. కొంగన్నపల్లి గ్రామానికి చెందిన తిమ్మప్ప(65) అనే రైతును ఏనుగు తొక్కి చంపింది. ఏనుగు దాడిలో రైతు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. 



(ఏనుగుల దాడిలో తిమ్మప్ప అనే రైతు మృతి)


తిరుమలలో బైకర్ ను వెంబడించిన ఏనుగు


తిరుమలలో ఏనుగుల గుంపు సంచరిస్తుంది. ఏనుగుల గుంపు తరచు రోడ్లపైకి వస్తూ భక్తులను భయాందోళనలకు గురిచేస్తుంది. ఇటీవల కౌండిన్య అటవీ ప్రాంతం నుంచి శేషాచలం అటవీ ప్రాంతంవైపు  ఏనుగుల గుంపు వెళ్లింది. దీంతో పాపనివాశనం వెళ్లాలంటే భక్తులు భయాందోళనకు గురయ్యారు. వారం రోజుల వ్యవధిలో నాలుగు సార్లు ఏనుగుల గుంపు రోడ్లపైకి వచ్చాయి. వారం క్రితం నాలుగు రోజులు పాటు పాపవినాశనం రోడ్డులో ఏనుగులు తిష్టవేశాయి. ఆ మార్గంలో  బైక్ పై వస్తున్న వారిని ఏనుగులు దాడికి యత్నించాయి. దీంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. 


ఏనుగు దాడిలో రైతు మృతి


చిత్తూరు జిల్లాలో సదుం మండలం జోగివారి పల్లి గ్రామ పరిధిలోని వారం క్రితం గొల్లపల్లికి చెందిన ఎల్లప్ప(38) రాత్రి పొలం వద్ద ఉండగా ఏనుగు అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ దాడిలో రైతుకు తీవ్రగాయాలయ్యాయి. ఈ సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు రైతును వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రైతు ఎల్లప్ప మృతి చెందాడు. 


జిల్లాలో ఏనుగుల బెడద 


చిత్తూరు జిల్లాలో ఏనుగుల సమస్య ఇటీవల ఎక్కువైంది. కొన్ని రోజులుగా మామిడి తోటలను ధ్వంసం చేయడంతో పాటు పొలాల్లోని మోటార్లను నాశనం చేస్తున్నాయి. రాత్రుల్లో పంట పొలాల దగ్గర ఉంటున్న రైతులపై దాడి చేస్తున్నాయి. ఈ దాడిలో రైతులు ప్రాణాలు కూడా కోల్పోతున్నాయి. అటవీ అధికారులు ఏనుగుల గుంపులను అటవీ ప్రాంతాల్లోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాత్రుళ్లు ఒంటరిగా పొలాలకు వెళ్లోద్దని అంటున్నారు. ఏనుగుల గుంపు కనిపిస్తే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఉండాలని కోరుతున్నారు.