అమరావతి రైతుల న్యాయస్థానం టు దేవస్థానం మహా పాదయాత్ర చిత్తూరు జిల్లాలో కొనసాగుతుంది. 42వ రోజు రేణిగుంట మండలం అంజిమేడు గ్రామం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర దాదాపు 16 కిలో మీటర్లకు పైగా కొనసాగి రేణిగుంటకు చేరుకుంది. ఆదివారం రాత్రి రేణిగుంటలోని పాత చెక్ పోస్టు వద్ద ఉన్న వై.కన్వెన్షన్ హాల్ రాజమాత కళ్యాణ మండపంలో రైతులు బస చేయనున్నారు. తిరిగి రేపు ఉదయం రేణిగుంట నుంచి ప్రారంభించి రైతులు తిరుపతికి చేరుకోనున్నారు. రేణిగుంటకు చేరుకున్న రైతులను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, డాక్టర్ రమాదేవి కలిసి మద్దతు తెలిపారు. అయితే రైతుల‌ మహా పాదయాత్రకు భాగస్వామ్యమైన ఎంపీ గల్లా జయదేవ్ కు రైతులు తలపాగా కట్టారు. అనంతరం రైతులతో కలిసి కొద్ది సేపు గడిపిన ఆయన జై అమరావతి జైజై అమరావతి అంటూ నినాదాలు చేశారు.


Also Read:  ఏపీకి వైసీపీ హానికరం... లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రాన్ని ప్రైవేటీకరణ చేస్తారా.... ఉక్కు దీక్షలో పవన్


ఎంపీ గల్లా జయదేవ్ మీడియాతో మాట్లాడుతూ.. 'ఎన్ని కష్టాలు వచ్చినా అమరావతి రైతులు, మహిళలు ఓర్చుకుని రేణిగుంటకు చేరుకున్నారు. అడుగడుగునా అమరావతి రైతులకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ తమ మద్దతును తెలిపారు. రేపు అమరావతి రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు. దిల్లీలో రెండు సంవత్సరాల పాటు రైతులు దీక్ష చేయడం చాలా గొప్ప విషయం అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా 726 రోజుల పాటు దీక్ష చేస్తూ చాలా ఇబ్బందులకు గురి అయ్యారని, దీని కారణంగా రాష్ట్ర స్థాయిలో స్పందన వస్తుందని ఆయన తెలియజేశారు. అంతే‌కాకుండా రైతులపై దేశ వ్యాప్తంగా సానుభూతి వస్తుందని, అమరావతి రైతుల సమస్యే కాదని, రాష్ట్ర ప్రజల కోసం ఒకే రాజధాని, ఒకే అమరావతి కోసం అందరూ కలిసి నడవాల్సిన సమయం అని' గుర్తుచేశారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగా మెరుగు పడాల్సిన అవసరం ఉందని, ఇప్పటి వరకూ ఏపీలో రాజధాని లేకపోతే ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయని గల్లా జయదేవ్ ప్రశ్నించారు.


Also Read:  చంద్రబాబు చూడాల్సింది అఖండ మూవీ కాదు జస్టిస్ చంద్రు వీడియో... ప్యాకేజీకి ఓకే చెప్పినప్పుడే హోదా కనుమరుగు 


తెలంగాణలో హైదరాబాద్ లాంటి రాజధాని ఉంది కాబట్టి దానిపై వచ్చిన ఆదాయంతో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేస్తున్నారని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. దీని ద్వారా రైతులకే కాకుండా రాష్ట్రానికి చాలా లాభదాయమన్నారు. ఎప్పుడైనా రాష్ట్రంలో ఒక పెద్ద సిటీ ఉంటేనే ఆర్థిక వ్యవస్ధ బాగా బలపడుతుందని ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. అనంతరం గల్లా జయదేవ్ సోదరి డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ.. అమరావతి రైతుల పాదయాత్రలో 50 శాతం మహిళలను చూడడం ఎంతో గర్వంగా ఉందన్నారు. మామూలుగా 10 కిలోమీటర్లు నడిస్తేనే తీవ్రంగా ఇబ్బందులు పడతామని, అలాంటిది 42 రోజుల పాటు మహిళలు పాదయాత్రలో ఎటువంటి విరామం లేకుండా కొనసాగడం గొప్ప విషయమన్నారు. భారీగా వర్షాలు పడితున్న సమయంలోనూ అవేవి లెక్క పెట్టకుండా అమరావతి రైతులు పాదయాత్రను కొనసాగించారన్నారు. ఈ పాదయాత్రలో పాల్గొంటున్న కొందరు రైతులకు భూములు కూడా లేవని, కానీ అమరావతి కోసం వారు పాదయాత్రలో పాల్గొంటున్నారని తెలిపారు.


Also Read: జగనన్న ఉన్నాడు జాగ్రత్త... గుంతల రోడ్డుపై ఫ్లెక్సీ... వైరల్ అవుతున్న వీడియో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి