నగిరి ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్టు వారెంట్ జారీ అయింది. చెన్నైలోని జార్జి టౌన్‌ కోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. పరువునష్టం కేసులో ఆయన విచారణకు హాజరుకాకపోవడం వల్ల కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. ప్రముఖ సినీ దర్శకుడైన ఆర్కే సెల్వమణి ప్రస్తుతం దక్షిణభారత చలనచిత్ర కార్మిక సంఘాల సమ్మేళనం అధ్యక్షుడిగా ఉన్నారు. 


ఏం జరిగిందంటే..
2016లో ఆర్కే సెల్వమణి, తమిళనాడులో కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే అరుళ్‌ అన్బరసు కలిసి ఓ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ముఖాముఖిలో ప్రముఖ ఫైనాన్షియర్‌ అయిన ముకుంద్‌చంద్‌ బోద్రా అనే వ్యక్తి గురించి తమ వ్యక్తిగతంగా పలు అభిప్రాయాలు వెల్లడించారు. అవి బోద్రా ప్రతిష్ఠకు భంగం కలిగించాయనే అభిప్రాయంతో ఆయన వారు ఇద్దరిపై చెన్నై జార్జిటౌన్‌ కోర్టులో పరువునష్టం దావా వేశారు. కొన్నాళ్లకు ముకుంద్ చంద్ర బోద్రా మృతిచెందారు. ఆయన అనంతరం ఆ కేసును అతని కుమారుడు గగన్‌ బోద్రా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసు మంగళవారం చెన్నై జార్జి టౌన్ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా వారు ప్రత్యక్షంగా హాజరు కావాలని అంతకుముందే కోర్టు ఆదేశించింది. 


నేడు విచారణ సందర్భంగా సెల్వమణి, అరుళ్‌ అన్బరసులు ఇద్దరూ కోర్టుకు హాజరు కాలేదు. వారి తరఫున న్యాయవాదులు కూడా కోర్టుకు రాలేదు. దీంతో న్యాయమూర్తి వారిద్దరిపై బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌ జారీచేస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.


మంత్రి పదవి కోసం ఎమ్మెల్యే రోజా ప్రయత్నాలు 
నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ మధ్య ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మంత్రి పదవి ఆశిస్తున్నారు. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ఆమెకు కీలకమైన మంత్రి పదవి వరిస్తుందని అంతా భావిస్తున్నారు. తిరుమల, శ్రీకాళహస్తితో పాటు, ఇటీవల కాశీ పర్యటనకు వెళ్లారు. తన కుటుంబ సభ్యులతో వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాశీలో పర్యటించి గంగా హారతిని తిలకించారని, గంగా హారతిని వీక్షించడం చాలా సంతోషంగా ఉందని రోజా అన్నారు. చాలా మంది తమ జీవితంలో ఒక్కసారైనా గంగా హారతి చూడాలని కోరుకుంటారని, అయితే అది కొందరికే సాధ్యమవుతుందని ఆ వీడియో ద్వారా రోజా చెప్పారు. వైఎస్‌ జగన్‌ కేబినెట్‌లో ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి వస్తుందని వార్తలు వస్తున్న తరుణంలో రోజా ఆధ్యాత్మిక యాత్రల్లో నిమగ్నం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.