AP Election Counting Updates: ఆంధ్రప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గరపడుతోంది. గెలుపుపై అధికార, ప్రతిపక్షాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారాలు, సభలు, సమావేశాలతో బిజీ బిజీగా గడిపిన పలు పార్టీల అధినేతలు విశ్రాంతి కోసం విదేశాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్లిపోయారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan) కుటుంబంతో సహా లండన్ పర్యటనకు వెళ్లగా, టీడీపీ అధినాయకుడు చంద్రబాబు (Chandrababu Naidu) దేశంలోని  ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకుని విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్లారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కుటుంబంతో సహా రష్యా వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) అమెరికాలో ఉన్న తల్లీ, పిల్లల వద్దకు వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) రాష్ట్రంలోనే ఉన్నారు. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా వీరంతా తాము పోటీ చేసిన నియోజకవర్గాల కౌంటింగ్ జరిగే ప్రదేశాలకు వెళ్లడం లేదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ అమరావతిలో ఉంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిల, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి దేవి సైతం విజయవాడలో ఉంటూ కౌంటింగ్‌ సరళిని పరిశీలించనున్నారు.


విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన చంద్రబాబు
విశ్రాంతి కోసం ఈ నెల 19న విదేశాలకు వెళ్లిన టీడీపీ అధినేత చంద్రబాబు  బుధవారం ఉదయం హైదరాబాద్ వచ్చారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం హైదరాబాద్ నివాసానికి చేరుకున్న చంద్రబాబు వెంటనే పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కౌంటింగ్ సమయంలో  తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలోనే ఈ నెల 31న పవన్ కల్యాణ్‌తో ఉండవల్లి నివాసంలో చంద్రబాబు భేటీ కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల ఫలితాల సందర్భంగా చంద్రబాబు తాను పోటీ చేసిన కుప్పం వెల్లడం లేదు. అమరావతిలో ఉంటూ నేతలతో కౌంటింగ్ సరళిని పర్యవేక్షించనునన్నారు. ఇక 3వ తేదీ పార్టీ కేడర్‌తో సమావేశమయ్యి కౌంటింగ్ సందర్భంగా వ్యవహరించాల్సిన విధానాలపై చీఫ్ పోలింగ్ ఏజెంట్లకు పలు సూచనలు చేయనున్నారు.  


రేపు రాష్ట్రానికి వైఎస్ జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటన గురువారంతో ముగియనుంది. శుక్రవారం అర్ధరాత్రి లేదా శనివారం తెల్లవారుజామున తాడేపల్లి చేరుకుంటారని వైసీపీ పెద్దలు చెబుతున్న సమాచారం. ఈ మే 17న జగన్, తన సతీమణి భారతి, కుమర్తెలు వర్ష, హర్షలతో కలిసి ఇంగ్లండ్, స్విడ్జర్లాండ్‌లో పర్యటించారు. విదేశీ పర్యటనలో ఉన్నా.. కీలకమైన అంశాలపై వైసీపీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. జూన్ నాలుగో తేదీన కౌంటింగ్ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ఏజెంట్లుగా దీటైన సమర్థులైన పార్టీ కార్యకర్తలను నియమించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటింగ్ ఏజెంట్ల నియామకంపై ఇప్పటికే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులతో సమావేశాలు నిర్వహించి అవసరమైన సూచనలిస్తున్నారు. జగన్ రాష్ట్రానికి వచ్చిన వెంటనే పార్టీ కీలక నేతలతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కౌంటింగ్‌ పర్యవేక్షణలో భాగంగా సీఎం జగన్ కౌంటింగ్ కేంద్రానికి వెల్లడం లేదు.
  
చంద్రబాబుతో భేటీకానున్న పవన్
ఎన్నికల అనంతరం జనసేన అధినేత పవన్ కొద్ది రోజుల పాటు హైదారాబాద్‌లో గడిపారు. ఆ తరువాత కుటుంబంతో కలిసి రష్యా పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కౌంటింగ్ సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో గురువారం ఆయన ఇండియాకు తిరిగి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుక్రవారం బీజేపీ నేతలు, చంద్రబాబుతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో పోలింగ్‌కు సంబంధించిన విశ్లేషణతో పాటు కౌంటింగ్‌ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధికార వైసీపీని ధీటుగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ తాను పోటీ చేసిన పిఠాపురం కౌంటింగ్ కేంద్రానికి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. వైసీపీ ఓటమే తన లక్ష్యమని పవన్ చాలా కాలంగా చెబుతూ వచ్చారు.


విజయవాడలో షర్మిల, పురందేశ్వరి
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి సైతం కౌంటింగ్ రోజు విజయవాడలో ఉండనున్నారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. దగ్గుపాటి పురందేశ్వరి ఎన్డీఏ కూటమి తరఫున రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. వీరు సైతం కౌంటింగ్ రోజు తాము పోటీ చేసిన నియోజకవర్గాలు ఉండే జిల్లాలకు వెళ్లడం లేదు. విజయవాడలో ఉంటూ కౌంటింగ్‌ సరళిని పర్యవేక్షించనున్నారు.