Chandrababu To UPSC : టీడీపీ అధినేత చంద్రబాబు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC )కి లేఖ రాశారు. ఐఏఎస్ కన్ఫర్మేషన్ ప్రక్రియను వాయిదా వేయాలని కోరారు. ఐఏఎస్‌కు రాష్ట్ర కేడర్ ఆఫీసర్ల ఎంపిక కార్యక్రమాన్ని మోడల్ కోడ్ ఉన్నప్పుడు చేయడం సముచితం కాదని చెప్పారు. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు నియమించొద్దని యూపీఎస్సీని చంద్రబాబు కోరారు. వారి ప్రమోషన్స్ ముఖ్యమంత్రి కార్యాలయంలోని వారికే పరిమితం చేశారన్నారు. ఇప్పుడు కూడా జాబితా తయారీలో పారదర్శకత లేదని అన్నారు. ఈ అంశాన్ని పునః పరిశీలించాలని యూపీపీఎస్సీ చైర్మన్‌ను చంద్రబాబు నాయుడు కోరారు.                             


ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ చేపట్టడం ఎన్నికల నియమావళికి విరుద్ధం అని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఇంకా ముగియనందున ఇప్పుడు కన్ఫర్మేషన్ ప్రక్రియ సరికాదని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నాన్‌ రెవెన్యూ ఐఏఎస్‌ పోస్టులు రెండు ఖాళీలున్నాయి. రెండు పోస్టుల కోసం  యూపీఎస్సీ ఈ ఏడాది ఫిబ్రవరి 8న  నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెండు పోస్టులకు 46 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిని జీఏడీ అధికారులు స్ర్కూటినీ చేసి 10మంది పేర్లు సిఫారసు చేశారు.                           


గడికోట మాధురి, భూమిరెడ్డి మల్లికార్జున రెడ్డి, ఎం.కె.వి.శ్రీనివాసులు, డా.ఎం.వరప్రసాద్‌, డి.దేవానంద రెడ్డి, పి.ఎ్‌స.సూర్యప్రకాశ్‌, జి.రాజారత్న, సి.బి.హరినాథ్‌ రెడ్డి, సి.హెచ్‌.పుల్లారెడ్డి, ఏఏఎల్‌ పద్మావతి పేర్లను కన్ఫర్డ్‌ ఐఏఎస్‌ హోదాకోసం ప్రభుత్వం తరపున ప్రతిపాదించారు.  ఐదుగురు కడప జిల్లాకు చెందిన ఒకే సామాజికవర్గం వారన్న ఆరోపణలు ఉద్యోగవర్గాల్లో వచ్చాయి. సరైన సమాచారం ఉన్నా.. తమ దరఖాస్తులు తీసుకోలేదని చాలా మంది అధికారులు అసంతృప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు.                         


ఈ పోస్టులకు కౌంటింగ్ పూర్తయ్యేలోపు ఇంటర్యూలు నిర్వహించాలని సీఎస్ జవహర్ రెడ్డి.. యూపీఎస్సీని కోరినట్లుగా తెలుస్తోంది. ఇవన్నీ టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో ఆయన ప్రక్రియను నిలిపివేయాలని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇంటర్యూలు నిర్వహించాలని కోరుతున్నారు. 
గత నవంబర్‌లోనూ ప్రభుత్వం  ఇద్దరు అధికారులకు కన్‌ఫర్డ్ ఐఏఎస్‌ హోదా ఇప్పించింది. డాక్టర్ నీలకంఠా రెడ్డి, బొమ్మినేని అనిల్ కుమార్ రెడ్డిలు ఇద్దరికి IAS లుగా ప్రమోషన్ ఇస్తూ డీవోపీటీ గత నవంబర్‌లో ఉత్తర్వులు జారి చేసింది.  ప్రతి గ్రూప్ వన్ ఆఫీసర్ కు.. కన్ ఫర్డ్ ఐఏఎస్‌ గా గుర్తింపు పొందాలని ఆశ ఉంటుంది. అందు కోసం కష్టపడతారు. అయితే అతి కొద్ది మందికే అవకాశం లభిస్తుంది. కన్ ఫర్డ్ ఐఏఎస్‌లు కూడా కలెక్టర్లుగా బాధ్యతలు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈ పోస్టుల కోసం  గ్రూప్ వన్ స్థాయి అధికారులు పోటీ పడుతూంటారు.