Modi Invitation To Babu :   తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశానికి మరోసారి ఆహ్వానం లభించింది. డిసెంబర్ 5వ తేదీన చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు.  జీ-20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహించనుంది. ఈ సదస్సు నిర్వహణపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ చర్చించి.. సలహాలు తీసుకోనున్నారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి  చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. అలాగే సమావేశ ప్రాధాన్యతను కూడా టీడీపీ అధినేతకు ప్రహ్లాద్ జోషి ఫోన్‌లో వివరించి హాజరు కావాల్సిందిగా కోరారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు మరొకసారి టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబర్ 5న ఢిల్లీకి వెళ్లనున్నారు. 


చంద్రబాబుకు ఫోన్ చేసిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి 


ఇటీవలి కాలంలో ప్రధాని నరేంద్రమోదీతో సమావేశానికి చంద్రబాబుకు రెండో సారి ఆహ్వానం అందింది.   ఇటీవల జరిగిన ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశానికి కూడా చంద్రబాబును కేంద్రం ఆహ్వానించింది. ఆ సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి ఆహ్వానం పలికారు.   జి-20 కూటమి దేశాలు ప్రపంచ స్థూల ఉత్పత్తిలో 80 శాతాన్నీ, వాణిజ్యంలో 75 శాతాన్ని కలిగి ఉన్నాయి. అంటే దాదాపుగా ప్రపంచంలో మూడు వంతు దేశాలకు ఈ కూటమి ప్రాతినిధ్యం వహిస్తోంది.ఈ సమావేశం నిర్ణయాల ద్వారా ప్రపంచంపై తనదైన ముద్ర వేయడానికి భారత్‌కు అవకాశం లభిస్తోంది. అందుకే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షుల అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు.


అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకుంటున్న కేంద్రం


ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులనూ పిలుస్తున్నారా లేకపోతే.. కొంత మంది అనుభవం ఉన్న ఎంపిక చేసిన వారినే పిలుస్తున్నారా అన్నదానిపై స్పష్టత లేదు. రాజకీయ పార్టీలతో ఓ సారి.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మరోసారి భేటీ అయి సూచనలు, సలహాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. రాజకీయాలకు సంబంధం లేని కార్యక్రమం.. ప్రపంచంలో భారత దేశ పరపతీని పెంచే కార్యక్రమం కావడంతో.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అన్ని రాజకీయ పార్టీల నేతలూ తమ సలహాలు.. సూచనలు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. 


ఏపీలో రాజకీయ పరమైన చర్చ జరిగే అవకాశం 


ప్రధానమంత్రితో సమావేశానికి ఏపీ ప్రతిపక్ష నేతకు పిలుపు అంటే.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరమైన చర్యలు కూడా సాగుతాయి. ఎదుకంటే ఏపీలో రాజకీయాలు డైనమిక్‌గా మారిపోతున్నాయి. పొత్తుల గురించి చర్చలు నడుస్తున్నాయి. అందుకే.. సమావేశం కూడా హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది. 2014లో ఎన్డీఏలో టీడీపీ ఉంది. 2018లో బయటకు వచ్చింది. ఆ తర్వాత మోదీని చంద్రబాబు ఒక్క సారిగా మాత్రమే కలిశారు. అది కూడా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో మాత్రమే కలిశారు.  తాజాగా మరోసారి ప్రధాని సమావేశానికి చంద్రబాబు హాజరు కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఉత్కంఠ రేపుతోంది.