Chandrababu :  జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాణ్ పై రాష్ట్ర ప్రభుత్వం పరువు నష్టం కేసు దాఖలు చేసేందుకు జీవో ఇవ్వడాన్ని తెలుగు దేశం పార్టి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక కేసులు పెట్టి అణిచి వేయాలనుకోవటం అవివేకమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పవన్ పై కేసు పెట్టడం బుద్దిలేని, నీతిమాలిన చర్యగా ఆయన అభివర్ణించారు.  తప్పులు చేస్తున్న తప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా నేరం అనే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆయన అభ్యంతరం తెలిపారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ పై జగన్ ప్రభుత్వం పరువు నష్టం కేసు పెట్టడాన్ని సమాజం మెత్తం ఖండించాల్సి ఉందని ఆయన పిలుపునిచ్చారు. 


సమస్యలు ప్రస్తావిస్తే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు : చంద్రబాబు 


ప్రజలు తమ సమస్యలను ప్రస్తావిస్తే దాడులు  చేయటం, రాజకీయ పక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెట్టటం అనేది జగన్ రాక్షస ప్రభుత్వ విధానం అయ్యిందని చంద్రబాబు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం అంటే జవాబుదారీగా ఉండాలని, ఇలాంటి అణచివేత ధోరణి మానుకోవాలని ఆయన హితవు పలికారు.  నిబంధనలకు వ్యతిరేకంగా ప్రజల వ్యక్తి గత వివరాలను వాలంటీర్ల ద్వారా సేకరించడాన్ని పవన్ కళ్యాణ్  ప్రశ్నిస్తే కేసు పెడతారా అని చంద్రబాబు ప్రశ్నించారు. వాలంటీర్ల పై అంత ప్రేమెందుకో కూడ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తి గత వివరాలు, కుటుంబ వ్యవహారాల పై ప్రభుత్వం సమాచారం సేకరించడమే తప్పని అన్నారు. పైగా దాన్ని దుర్వినియోగం చేయడం నీచాతినీచమని మండిపడ్డారు. కేసు పెట్టాల్సి వస్తే ప్రభుత్వ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న సీఎం జగన్ పై ముందుగా కేసు పెట్టి విచారణ జరిపించాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.  


ఈ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడటమే జోక్ : చంద్రబాబు


ఈ ప్రభుత్వం పరువు గురించి మాట్లాడడమే  పెద్ద జోక్ అని అన్నారు. నాలుగేళ్ళు  దిక్కుమాలిన పాలనలో రాష్ట్ర పరువు, ప్రతిష్ట ఎప్పుడో మంటగలిశాయని ఆరోపించారు. రోజులో 24 గంటలూ ప్రజల గొంతు ఎలా నొక్కాలి అనే అరాచకపు ఆలోచనలు పక్కన పెట్టి, రాష్ట్రంలో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టండని సూచించారు. ప్రశ్నించిన వారి పై అక్రమ కేసులు, వ్యక్తి గత దాడి, జగన్ ప్రభుత్వ పాపాలను దాచిపెట్టలేవని, ప్రభుత్వానికి ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.


 పరువు నష్టం కేసు పై సర్కార్ ఆరా..!


మరో వైపున ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పరువు నష్టం కేసు ను ఫైల్ చేసేందుకు జగన్ సర్కార్ జీవో ను కూడ జారీ చేసింది. ఇందుకు సంబందించి న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్ళాలి, పవన్ చేసిన కామెంట్స్ ను రికార్డ్ చేసి న్యాయ స్దానం ముందు ఉంచటంతో పాటుగా పలువురు వాలంటీర్లను కూడా ప్రభుత్వం తరపున కోర్టులో సాక్ష్యం చెప్పించేదుకు రెడీ చేస్తున్నారు. పరువు నష్టం కేసును ఎట్టి పరిస్దితుల్లో కీలకంగా తీసుకోవాలని ఇప్పటికే అధికారులకు సీఎంవో ఆదేశించింది.   అతి త్వరలోనే హై కోర్ట్ లో ప్రభుత్వం తరపున న్యాయవాదులు పరువు నష్టం కేసును ఫైల్ చేయనున్నారు.