Chandrababu Selfie Challenge To Jagan  :  ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్ష నేత చంద్రబాబు వినూత్నమైన చాలెంజ్ విసిరారు. నెల్లూరులో పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన చంద్రబాబు అక్కడ టిడ్కో ఇళ్ల దగ్గర ఆగారు. వాటితో సెల్ఫీ దిగారు. ఆ తర్వతా సోషల్ మీడియాలో సీఎం జగన్‌కు సవాల్ చేశారు. ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలని.. మీ ప్రభుత్వ హయాంలో కట్టిన ఇళ్లు ఎక్కడ అని ప్రశ్నించారు. 





చంద్రబాబు చూపించిన  టిడ్కో ఇళ్లకు బ్లూ  , వైట్ కలర్స్ వేసి ఉన్నాయి.  అవి వైఎస్ఆర్‌సీపీ పార్టీ రంగులు. కానీ ఇళ్లు కట్టింది మాత్రం తెలుగుదేశం పార్టీ హయాంలో. అప్పటి మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ ప్రత్యేక శ్రద్ధతో నెల్లూరు పట్టణ శివార్లలో అపార్ట్‌మెంట్లు నిర్మించారు.  లబ్ధిదారులకు మూడు కేటగిరీల కింద ఇళ్ల నిర్మాణం చేపట్టారు. 300 చదరపు అడుగుల ఇంటికి లబ్ధిదారుడు రూ.500 డిపాజిట్‌ చెల్లిస్తే చాలు. 365 చదరపు అడుగుల ఇంటికి రూ.50 వేలు, 430 చదరపు అడుగుల ఇంటికి రూ.లక్ష డిపాజిట్‌ చెల్లించాలని నిర్ణయించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేసింది. 300 చదరపు అడుగుల ఇళ్లు 1.43 లక్షలు, 365 చదరపు అడుగుల ఇళ్లు 44 వేలు, 430 చదరపు అడుగుల ఇళ్లు 74 వేలు.. మొత్తం 2.61 లక్షల ఇళ్ల నిర్మాణాలను దాదాపు పూర్తి చేసింది. 


కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, లబ్ధిదారుడి బ్యాంకు రుణంతో కలిపి ఈ ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. గత ప్రభుత్వంలో ఇళ్లను పంపిణీ చేసే క్రమంలో ఎన్నికల కోడ్‌ రావడంతో కార్యక్రమం ఆగిపోయింది. వైసీపీ సర్కారు వచ్చాక పూర్తయిన ఇళ్లను కూడా లబ్ధిదారులకు పంపిణీ చేయలేదు. దీంతో పలుచోట్ల నిర్వహణ లేక పక్కా భవనాలు పాడు పడుతున్నాయి. వాటిలో పిచ్చిమొక్కలు పడ్డాయి. ప్రతిపక్షాలు, లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేయడంతో వాటికి రంగులు వేయించి.. మిగిలిన పనులు పూర్తి చేసి పంపిణీ చేయాలనుకుంటున్నారు కానీ .. రంగులు మాత్రం వేశారు..ఇతర పనులు మాత్రం ఆగిపోయాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 



టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు డిపాజిట్లు తగ్గిస్తామని వైసీపీ సర్కారు ఆర్భాటంగా ప్రకటించింది. 300 చదరపు అడుగుల ఇళ్లను ఒక్క రూపాయికే ఇస్తామని చెప్పింది. 365 చదరపు అడుగుల ఇళ్లను రూ.25 వేలకు, 430 చదరపు అడుగుల ఇళ్లను రూ.50 వేలకే ఇస్తామని సీఎం జగన్‌ ఆర్భాటంగా ప్రకటించారు. లబ్ధిదారులు చెల్లించిన డిపాజిట్లలో సగం తిరిగి ఇచ్చేలా ఆదేశాలు కూడా ఇచ్చారు. 
మూడు కేటగిరీల్లో నిర్మించిన ఇళ్లకు సంబంధించి రూ.లక్ష డిపాజిట్‌ కట్టిన లబ్ధిదారులకు రూ.50 వేలకు, రూ.50 వేలు కట్టినవారికి రూ.25 వేలకు, రూ.500 డిపాజిట్‌ చెల్లించిన వారికి రూపాయికే ఇళ్లు ఇస్తామని జగన్‌ సర్కారు  ఉత్తర్వులు జారీచేసింది. కానీ ఇప్పటి వరకూ ఇళ్లు కూడా ఇవ్వలేదు.. డిపాజిట్లు కూడా ఇవ్వలేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  



చంద్రబాబు సెల్ఫీ చాలెంజ్ క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  టీడీపీ నేతలు విస్తృతంగా చంద్రబాబు సోషల్ మీడియా పోస్టును వైరల్ చేస్తున్నారు.