Cyclone Michaung Updates: అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడి ఏపీ వైపు దూసుకొస్తున్న మిగ్‌జాం తుపాను కారణంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శ్రీశైలం మల్లన్న దర్శనాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పటికే తిరుమల, విజయవాడ కనకదుర్గమ్మ, సింహాచలం అప్పన్నను దర్శించుకున్న చంద్రబాబు..  షెడ్యూల్‌ ప్రకారం మంగళవారం (డిసెంబర్ 5న) శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. అయితే, తుపాను కారణంగా పర్యటనను వాయిదా వేసిన చంద్రబాబు.. రానున్న రోజుల్లో శ్రీశైలం మల్లన్న, కడప దర్గా, మేరీమాత చర్చిలను దర్శించుకోనున్నారు. మరోవైపు, తుపాను తీవ్రత కారణంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేస్ యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించారు. ఈ మేరకు తెదేపా వర్గాలు వెల్లడించాయి.

  


యువగళం ముగింపు సభ భారీగా ప్లాన్ - చంద్రబాబు, పవన్‌ హాజరు 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చింది. మరో 12 రోజుల్లో ముగింపు సభ నిర్వహించనున్నారు. డిసెంబరు 17న భీమిలి నియోజకవర్గంలో సభ ఉంటుందని టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. పాదయాత్ర ముగింపు సభ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ను కూడా రప్పించనున్నట్లుగా పల్లా శ్రీనివాస్‌ వెల్లడించారు. 


లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 6 తేదీకి అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చేరుకుంటుంది. పాయకరావుపేట నుంచి ఈ నెల 7వ తేదీన యువగళం పాదయాత్ర మొదలై, ఈ నెల 17వ తేదీన భీమిలి నియోజకవర్గంలో ముగియనుంది. చెప్పారు. యువగళం ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 


అరకు పార్లమెంట్ అధ్యక్షుడు, అరకు, గుడివాడ నియోజకవర్గాల ఇంచార్జ్ ల నియామకం


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అరకు పార్లమెంట్ అధ్యక్షులుగా కిడారి శ్రావణ్ కుమార్ ని, అరకు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ గా సియ్యారి దొన్నుదొరని నియమించారు. గుడివాడ నియోజకవర్గ ఇంచార్జ్ గా వెనిగండ్ల రాముని నియమించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో పేర్కొన్నారు.