Gurazala in Palnadu District: తాము వచ్చిన వెంటనే పల్నాడు జిల్లాలోని వరికిపుడిసెల ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అభివృద్దికి మారుపేరు టీడీపీ అని, విధ్వంసానికి మారుపేరు వైసీపీ అని వ్యాఖ్యానించారు. పల్నాడు జిల్లాల్లో అనేకమంది తమ్ముళ్లను పోగొట్టుకున్నానని, కోడెలను వేధించి ఆయన మృతికి వైసీపీ నేతలు కారణమయ్యారని ఆరోపించారు. శనివారం గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లిలో జరిగిన రా.. కదలి.. రా బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పోలీసుల విచారణ పేరుతో పిలిచి పార్టీ కార్యకర్తలను చంపుతున్నారని, తాగునీటి కోసం వచ్చిన ఎస్టీ మహిళలను తొక్కించి చంపారని అన్నారు. పల్నాడు జిల్లాలోని నరహంతకులను వదిలిపెట్టేది లేదని, తీవ్రవాదులు, ముఠా నాయకులను అణచివేసింది తామేనని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఐదేళ్లలో పల్నాడులో ఒక్క పనైనా చేశారా?
'పల్నాడు జిల్లాలో 30 మందిని పొట్టనపెట్టుకున్నారు. పల్నాడులోని పలు గ్రామాల ప్రజల ఊర్లు వదిలిపోయారు. పల్నాడు జిల్లా ప్రజల అభివృద్దికి మా వెంట నడవాలి. నా ఇంటి గేట్లకు తాళాలు వేసినప్పుడు జగన్‌ను హెచ్చరించా. ఈ తాళ్లే నీ మెడకు ఉరితాళ్లు అవుతాయని ఆనాడే చెప్పా. జగన్ నోటిని శాశ్వతంగా మూయించే శక్తి మాకుంది. ఏ తప్పు చేయని ప్రత్తిపాటి శరత్‌ను అరెస్ట్ చేశారు. జగన్ చేసిన తప్పులకు ఎన్ని సంవత్సరాలు జైల్లో ఉంచాలి? జగన్ బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవరూ లేరు. పులివెందుల పంచాయతీ చేస్తే కుర్చీని మడిచి మీ ఊరికి పంపిస్తాం. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా సిద్దం కావాలి. ఓడిపోయేందుకు సిద్దం.. సిద్దం అని జగన్ అంటున్నారు. పల్నాడు జిల్లాలో ఈ ఐదేళ్లలో ఒక్క పనైనా చేశారా? విరికిపుడిసెల ఎత్తిపోతలను ఏడాదిలోగా పూర్తి చేస్తాం. పల్నాడు జిల్లాలో తలపెట్టిన వాటర్ గ్రిడ్‌ను పూర్తి చేస్తాం' అని చంద్రబాబు పేర్కొన్నారు.
హు కిల్డ్ బాబాయ్.. జగన్ సమాధానం చెప్పాలి
పోలీస్ స్టేషన్లలో ఉంచి మన కార్యకర్తలను దారుణంగా వేధించారన్న చంద్రబాబు.. కార్యకర్తలను కాపాడుకునేందుకు యరపతినేని ఎన్నో త్యాగాలు చేశారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కులమతాలకు అతీతంగా ఓటు వేయాలని, మీరు నీతిగా, న్యాయంగా ఉంటే తాము కూడా అలాగే ఉంటామన్నారు. వైసీపీ ప్రభుత్వం పనైపోయిందని పోలీసులు కూడా గ్రహించాలని, తమ పోరాటం మా కోసం కాదని, ఐదుకోట్ల మంది ప్రజల బాగు కోసమని అన్నారు. హు కిల్డ్ బాబాయ్ అనేది జగన్ ఇప్పటికైనా చెప్పాలని చంద్రబాబు సవాల్ విసిరారు. హత్యలు చేసేవారు రాజకీయాలకు పనికిరారని జగన్ చెల్లి సునీత చెప్పిందని, ఎంతో బాధతో జగన్ పార్టీకి ఓటేయవద్దని చెప్పిందని గుర్తు చేశారు. బాబాయ్‌ను ఎవరు చంపారో చెప్పిన తర్వాతే జగన్ ఓటు అడగాలన్నారు. ఆస్తిలో వాటా అడిగిందని సొంత చెల్లి షర్మిలను ఇబ్బంది పెడుతున్నారని, టిష్యూ పేపర్‌లా వాడుకుని యూజ్ అంట్ త్రో విధానాన్ని జగన్ పాటిస్తున్నారని విమర్శించారు.
'మరో 40 రోజుల్లో జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్దం. జగన్‌కు అనేక ప్యాలెస్‌లు ఉన్నాయి. అవన్నీ సరిపోక విశాఖ రుషికొండలో మరో ప్యాలస్ కట్టారు. టీడీపీ, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టారు. పవన్, నా ఆలోచనలు ఒక్కటే.. మాలో విబేధాలు పెట్టలేవు. సంపద సృష్టించి ఆదాయం పెంచడం తెలిసిన పార్టీ మాది. ఈ నెల 5వ తేదీన బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తాం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.