Godavari Water: నీళ్లపై రాజకీయాలు చేయడం మంచిది కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ వద్ద జల వివాదాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్లపై పోటాపోటీగా మాట్లాడటం సరి కాదన్నారు. తెలంగాణ గోదావరి నీటిని మంజీరాకు మళ్లించినప్పుడు కూడా తాము అభ్యంతరం చెప్పలేదన్నారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయన్నారు. నీటి విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేయవద్దని, సముద్రంలో కలిసే నీటిని ఎవరైనా వాడుకోవచ్చని స్పష్టం చేశారు. తెలుగు జాతి ఒక్కటేనని, ఇరు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి తప్ప భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదని ఆయన హితవు పలికారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తానే మహబూబ్‌నగర్‌కు జూరాల నుంచి నీళ్లిచ్చానని, దేవాదుల, కల్వకుర్తి వంటి ప్రాజెక్టులను ప్రారంభించానని గుర్తు చేస్తూ, ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయాలే తప్ప విరోధాలు పెంచకూడదని ఆయన సూచించారు.
నీటి విషయంలో గొడవలు పడటం వల్ల రెండు రాష్ట్రాలూ నష్టపోతాయని, సామరస్య పూర్వక చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం , నీటి లభ్యతపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. గోదావరి మిగులు జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా రాయలసీమతో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు కూడా మేలు జరుగుతుందని బాబు పేర్కొన్నారు. తెలుగు ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం. విభజన సమస్యలు ఉన్నప్పటికీ, సాగునీటి విషయంలో మొండివైఖరి ప్రదర్శించకుండా, ఉమ్మడి ప్రయోజనాల కోసం అడుగులు వేయాలి అని ఆయన అభిప్రాయపడ్డారు.
పోలవరం ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే కాదని, ఇది దేశానికే గర్వకారణమైన బహుళార్థసాధక ప్రాజెక్టు అని ఆయన నొక్కి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనుల ఆలస్యం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా, రాష్ట్ర రైతులకు అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రాజెక్టు ఎత్తు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని, పూర్తి సామర్థ్యంతో నీటిని నిల్వ చేసి తీరుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వరదల సమయంలో లోతట్టు ప్రాంతాలకు, సరిహద్దు రాష్ట్రాలకు ఇబ్బంది కలగకుండా శాస్త్రీయంగా మేనేజ్‌మెంట్ చేస్తామని భరోసా ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీలో కరువు అనేది ఉండదని, గోదావరి జలాలను ఒడిసి పట్టడం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు తన ప్రసంగంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు.