Chandrababu : నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలంటే అవకాశం రావాలి.. అలా రాకపోతే ఎవరూ నాయకుడిగా మారలేరని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. వెనుకబడిన వర్గాలను ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేశానన్నారు. ఆదాయం పెంచే మార్గాలను సూచించానని బాబు గుర్తు చేశారు. ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన ‘జయహో బీసీ’ సదస్సులో ఆయన మాట్లాడారు. జయహో బీసీ ( JayahoBC )కోసం 40 రోజుల ప్రణాళిక రూపొందించామని, పేదల ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు. జయహో బీసీ లక్ష్యాలను లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో క్షేత్ర స్థాయికి తీసుకెళ్లేలా టీడీపీ ( TDP ) ప్రణాళిక ఉంటుందని చంద్రబాబు తెలిపారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నామని చంద్రబాబు అన్నారు. 90 శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు పరికరాలు అందజేశామని తెలిపారు. 125 కులాలకు ఆర్థికసాయం చేసిన పార్టీ టీడీపీ అన్నారు. కార్పొరేషన్ల ద్వారా రూ.3,500 కోట్లు ఖర్చు చేశామన్నారు. రూ.75 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన జగన్ నాలుగేళ్లలో బీసీలకు ఒక్క రూపాయి అయినా జగన్ ఇచ్చారా? అని బాబు ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటి? ఆయన ప్రశ్నించారు. రూ.వందల కోట్ల విలువ చేసే పరికరాలను వైసీపీ ప్రభుత్వం గోదాముల్లో ఉంచేసిందన్నారు. వాటిని తుప్పు పట్టేలా మార్చారు తప్ప పేదలకు ఇవ్వలేదని బాబు విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం రాగానే 34 శాతం ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించారని చంద్రబాబు తెలిపారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను రద్దు చేశారన్నారు. కనీసం బీసీ భవనాలను కూడా పూర్తిచేయలేకపోయారన్నారు. మూడు రాజధానులు కాదు.. రాష్ట్రానికి అమరావతి ఒకటే రాజధాని.. దాన్ని పూర్తి చేసి తీరుతామని బాబు అన్నారు. బీసీలకు ఏం చేశారని వైసీపీ నేతలు సాధికార యాత్ర చేపడుతున్నారని చంద్రబాబు నిలదీశారు. ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగితేనే నిజమైన అభివృద్ధి అని చంద్రబాబు చెప్పారు. టీడీపీ హయాంలో బీసీలకు జరిగిన మంచి.. వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారన్న విషయాలను సదస్సు ద్వారా టీడీపీ తెలియజేస్తోందని తెలిపారు. గతంలో బీసీ చెంతకు వచ్చే ధైర్యం చేయకూడదనే బీసీ రక్షణ చట్టం పెట్టామని తెలిపారు.
టీడీపీ పాలనలో బీసీలకు ఎంత మేలు జరిగిందో, వైసీపీ పాలనలో బీసీలు ఏం కోల్పోయారో జయహో బీసీ సదస్సు ద్వారా తెలియజేస్తున్నామని చెప్పారు. జయహో బీసీ కోసం 40 రోజుల కార్యాచరణ రూపొందించామని... జయహో బీసీ లక్ష్యాలను పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయికి తీసుకువెళ్లేలా ప్రణాళిక రచించామని చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. చెత్తపై కూడా సీఎం జగన్ పన్ను వేశారని విమర్శించారు. కరెంట్ ఛార్జీలు విచ్చలవిడిగా పెంచారని మండిపడ్డారు.