కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే వ్యూహాలపై టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు దృష్టి పెట్టారు. రెండో రోజు పర్యటనలో తన ప్రసంగాల్లో ఎక్కువగా మున్సిపల్ ఎన్నికలపైనే మాట్లాడారు. లక్ష్మీపురం రోడ్ షోలో మాట్లాడిన చంద్రబాబు కుప్పం ప్రశాంతమైన నియోజకవర్గమని.. తనను ఏడుసార్లు గెలిపించారని గుర్తు చేసుకున్నారు. కుప్పంలో టీడీపీ చేసిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్, వైసీపీ చేసింది శూన్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని మద్యం బ్రాండ్ లు ఎపిలో ఉన్నాయని దోచుకోవడం, దాచుకోవడమే జగన్  రాజకీయమని విమర్శించారు. 


Also Read : షెడ్యూలే రాలేదు.. అప్పుడే అభ్యర్థుల్ని టార్గెట్ చేశారు ! నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో అందరిదీ దూకుడే !


ఏపీలో ఇసుక దొరకడం లేదని.. కానీ ఏపీ ఇసుక బయట రాష్ట్రాల్లో దొరుకుతోందన్నారు. జగన్ చెత్త ముఖ్యమంత్రి కాబట్టే చెత్తపై పన్ను వేస్తున్నారని... చివరికి మరుగుదొడ్లకు కన్నేసిన ఘనుడు సిఎం అని విమర్శించారు. పన్నులు కడుతున్నాం కాబట్టి జగన్‌ను వచ్చి బాత్‌రూమ్‌లు కడగాలని డిమాండ్ చేయాలని ప్రజలకు సూచించారు. ఎపిలో సామాన్య ప్రజలు బతికే పరిస్థితుల్లో లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన సెంట్ స్థలాల్లో ఎవరూ ఇళ్లు నిర్మించుకోవద్దని.. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచితంగా నిర్మించి ఇస్తుందని ప్రకటించారు. 


Also Read : డబ్బుల కోసం ఓటర్ల ధర్నాలు ! ప్రజాస్వామ్యం పతనావస్థకు ఇదే సంకేతమా ?
  
కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓవరాక్షన్ చేస్తే తోకలు కట్ చేస్తామని హెచ్చరించారు.  కుప్పం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. కుప్పం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా  త్రిలోక్ ను ప్రకటించారు. 25వార్డు టిడిపి అభ్యర్థిగా లోకేష్ ను ప్రకటించారు. రోజంతా బిజిబిజీగా చంద్రబాబు పర్యటిస్తున్నారు.  ఉదయమే ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.  లక్ష్మీపురం ‌వరదరాజుల ఆలయాన్ని సందర్శించారు‌. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాపండితుల ఆశీర్వచనాలు స్వీకరించారు. అనంతరం లక్ష్మీపురంలో రోడ్ షో నిర్వహించారు. తర్వతా రాధాక్రిష్ణ రోడ్డులోని మసీదులో ప్రార్థనలు చేసి..ముస్లింల సమస్యలపై  నాయకులతో చర్చించారు. 


Also Read : జగన్‌ది దోపిడీ సర్కార్ - రెండున్నరేళ్ల కంటే ముందే టీడీపీ ప్రభుత్వం ! కుప్పంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు !


చంద్రబాబు నాయుడు రెండవ రోజు పర్యటనలోనూ ఫ్లెక్సీల రగడ చోటు చేసుకుంది. గుడిపల్లి మండలం గుంజా రాళ్ళపల్లి వద్ద ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను గుర్తుతెలియని దుండగులు చించివేశారు.   మండల కేంద్రమైన శాంతిపురంలోనూ టీడీపీ ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. చంద్రబాబు రోడ్ షోకు దారి పొడవునా ఫ్లెక్సీల ఏర్పాటు  చేయడంతో వైసీపీ నేతలు ఎవరికీ తెలియకుండా వచ్చి అక్కడక్కడా వాటిని చించేస్తున్నారు. ఫ్లెక్సీలను చించేసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని టిడిపి నేతల డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. 


Also Read: అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి