తిరుపతిలోని గంగమ్మ జాతరకు ఎంత ప్రాముఖ్యం ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిత్తూరు జిల్లాలో ఒక పెద్ద పండుగలా ఆ వేడుకను ప్రజలు జరుపుకుంటారు. అయితే, ఆ ఆలయ అలంకరణ ప్రస్తుతం వివాదానికి దారి తీసింది. ఆలయం వెలుపల ద్వారానికి పూలతో చేసిన అలంకరణలో వైఎస్ఆర్ సీపీ జెండాలు కనిపించడం, J అనే ఇంగ్లిషు అక్షరంతో పాటు ఓ తుపాకీ గుర్తు ఉండడంతో ఈ వ్యవహారం మరింత పెద్దది అవుతోంది. ‘J గన్’ అని అలంకరణలో ఏర్పాటు చేయడం పిచ్చికి పరాకాష్ఠ అని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అసలు ‘జే’ అనే అక్షరానికి గంగమ్మకు సంబంధం ఉందా? అని ప్రశ్నించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.
‘‘తిరుపతి గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా? దేవుని సన్నిధిలో ఈ 'గన్' సంస్కృతి ఏంటి? వైసీపీ జెండా గుర్తులు ఏంటి? పిచ్చి పట్టిందా? 'J' అక్షరానికి గంగమ్మకి సంబంధం ఉందా? మీ ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ళ దగ్గర ఇలాంటి వేషాలా?’’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
అంతకు ముందు లోకేశ్ కూడా
నారా లోకేష్ కూడా అలంకరణ ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసి వైసీపీ నేతల తీరును తప్పు పట్టారు. ‘‘దైవ సన్నిధిలోనూ జగన్ గ్యాంగులు తమ నేరబుద్ధిని చూపించుకుంటున్నాయి. తిరుపతి గంగమ్మ గుడి ఆవరణలో జగన్ పేరు వచ్చేలా జె అక్షరం, గన్ బొమ్మలొచ్చేలా పూలతో అలంకరించడం చూస్తే, ఎంతగా బరి తెగించారో తేటతెల్లమవుతోంది. దేవాలయాలపై గన్ బొమ్మలు వేస్తున్నారంటే, ప్రజల్నేకాదు, దేవుళ్లనీ బెదిరిస్తున్నట్టే’’ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు.. చివరి రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున గంగమ్మ దర్శనంకు భక్తులు విచ్చేస్తున్నారు.. మధ్యాహ్నం 3.00 గంటల నుంచి అనూహ్యంగా భక్తుల తాకిడీ పెరగడంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డితో సమీక్షించారు.. ఐతే ఈ ఒక్క రోజే మూడు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనానికి విచ్చేసినట్లు అధికారులు అంచనా వేశారు.. బుధవారం (మే 17) తెల్లవారి జామున 1.30 గంటలకు అమ్మ వారి విశ్వరూప దర్శనం, చెంప నరుకుడు ఘట్టాలతో గంగమ్మ జాతర పరిసమాప్తం కానుంది.