Chandrababu Naidu  interacting with the common people during field visits : రాజకీయ నేతలు ప్రజలతో సన్నిహితంగా ఉండాలనుకుంటారు. అయితే అందరినీ కలవడం సాధ్యం కాదు. కానీ వారితో కలిసి ప్రయాణిస్తున్న ఫీలింగ్ కల్పించడానికి ప్రయత్నించాలి. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అదే చేస్తున్నారు. 

చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు మండలంలోని గూడెంచెరువు గ్రామంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమానికి ఆటోరిక్షాలో వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు.  వుల్సాల అలివెలమ్మ అనే పించన్ లబ్దిదారు  ఇంటికి స్వయంగా వెళ్లి నెలవారీ పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు  అలివెలమ్మ   పెద్ద కుమారుడు వేణుగోపాల్‌కు చెందిన చేనేత యంత్రాన్ని పరిశీలించారు. వేణుగోపాల్ తన ఆరేళ్ల కుమారుడు హర్షవర్ధన్‌కు రాష్ట్ర ప్రభుత్వం   "తల్లికి వందనం" పథకం ద్వారా లబ్ధి చేకూరినట్లు చంద్రబాబుకు తెలిపారు.

అలివెలమ్మ   చిన్న కుమారుడు జగదీష్, ఆటోరిక్షా డ్రైవర్, ఆయన ఆటోలోనే చంద్రబాబు ప్రయాణించారు.  ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గూడెంచెరువులో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో చంద్రబాబు లబ్ధిదారులు ,  బంగారు కుటుంబాలతో సమావేశమయ్యారు.  ఈ కార్యక్రమం పేదల సేవ కోసం ఉద్దేశించినదన్నారు.  చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద 64 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 33,000 కోట్లను డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) ద్వారా అందజేస్తున్నట్లు తెలిపారు.  ఈ పథకం కింద ప్రతి నెలా రూ. 2,750 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు.  ఎన్నికల హామీ ప్రకారం పింఛన్‌ను రూ. 2,000 నుంచి రూ. 4,000కి పెంచినట్లు చెప్పారు. "అన్నదాత సుఖీభవ" పథకం కింద రైతులకు మొత్తం సొమ్ము ఆగస్టు 2న ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. 

జమ్మలమడుగు అభివృద్ధిలో భాగస్వాములైన పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. విపక్ష నాయకుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ "రప్ప రప్ప డైలాగులు" చెబుతున్నారని, రక్షణ కల్పించలేదని ఆరోపిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.   జగన్ రెడ్డి ప్రజలకు సరైన రక్షణ కల్పించలేకపోయారని, దీనికి విరుద్ధంగా తన ప్రభుత్వం పారదర్శకంగా,  ప్రజలకు దగ్గరగా పనిచేస్తోందని పేర్కొన్నారు. 

ఆటోరిక్షాలో ప్రయాణించడం ద్వారా సామాన్యుల సమస్యలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.  ఆయన ప్రజల మధ్యలో ఉండి, వారి సమస్యలను నేరుగా తెలుసుకోవడం ద్వారా "ప్రజల మనిషి"గా తనను తాను చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలోనూ వివిధ వర్గాల వారితో కలిసి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే చంద్రబాబు రాజకీయ జిమ్మిక్కులకు చేస్తున్నారని  విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.