Chandrababu in Davos: వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పర్యటనను క్షణం తీరిక లేకుండా షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు. సోమవారం జ్యూరిచ్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు స్విట్జర్లాండ్‌లో భారత రాయబారి మృదుల్ కుమార్ ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా స్పిరిట్ ఆఫ్ డైలాగ్ అనే థీమ్‌తో చంద్రబాబు అంతర్జాతీయ వేదికపై ఏపీ వాయిస్ వినిపిస్తున్నారు.
జ్యూరిచ్‌లో అడుగుపెట్టిన వెంటనే ముఖ్యమంత్రి పలువురు ప్రపంచ స్థాయి నేతలతో భేటీ అయ్యారు. సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, ప్రపంచ బ్యాంకు గ్రూప్ ప్రెసిడెంట్ అజయ్ బంగాతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమై ఆర్థికాభివృద్ధి, పరస్పర సహకారంపై చర్చించారు. అదేవిధంగా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను కలిసిన ఆయన, అస్సాం నుంచి దావోస్ సదస్సుకు హాజరైన తొలి ముఖ్యమంత్రిగా హిమంత చరిత్ర సృష్టించినందుకు అభినందనలు తెలియజేశారు.
ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు మొత్తం 36 కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా 20 దేశాలకు చెందిన ప్రవాస ఆంధ్రులతో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశంలో ఆయన ప్రసంగించి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతారు. అనంతరం రోడ్డు మార్గంలో దావోస్ చేరుకున్న ఆయన, అక్కడ ఏర్పాటు చేసిన ఏపీ లాంజ్ వేదికగా గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఐబీఎం చైర్మన్ అరవింద్ కృష్ణ వంటి దిగ్గజాలతో వన్-టు-వన్ సమావేశాలు నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ప్రతిపాదిత క్వాంటం వ్యాలీ , గ్రీన్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు వివరిస్తారు. ముఖ్యంగా బ్లూమ్‌బెర్గ్ నిర్వహించే ఏఐ మూమెంట్ సెషన్‌లో ఆయన కీలక ప్రసంగం చేయనున్నారు. ఐటీ మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడులతో కూడిన బృందం ఈ పర్యటన ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ డెస్టినేషన్‌గా మార్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.