టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం వద్ద శుక్రవాం జరిగిన ఘర్షణపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. టీడీపీ నేత జంగాల సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు నమోదు చేయగా, పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుపై మరో కేసు నమోదు చేసినట్లు తాడేపల్లి పోలీసులు తెలిపారు. శుక్రవారం పెడన ఎమ్మెల్యే జోగి రమేశ్ తన అనుచరులు, పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు వెళ్లారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారి కర్రలు, రాళ్లతో వైసీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరస్పర దాడులకు దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసుల లాఠీఛార్జ్ కూడా చేశారు.
అయ్యన్నపాత్రుడిపై కేసు
చంద్రబాబు నివాసం వద్ద దాడి ఘటనకు సంబంధించి పోలీసులు టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై నకరికల్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే జోగి రమేష్ కారు ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి టీడీపీ నేత నాదెండ్ల బ్రహ్మంపై నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు గత రాత్రి నుంచి ఎక్కడ ఉన్నారనే విషయంపై ఆరా పోలీసులు తీస్తున్నారు. తమ ఫిర్యాదులపై పోలీసులు స్పందించడంలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
జోగి రమేష్ పై కేసు
చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించారని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌పై కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో టీడీపీ ఫిర్యాదు చేసింది. కుట్ర పూరితంగా చంద్రబాబు ఇంటిపై దాడికి చేశారని జోగి రమేష్‌ను అరెస్టు చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు న్యాయబద్దంగా విచారణ చేసి జోగి రమేష్, ఆయన అనుచరులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
గవర్నర్ కు ఫిర్యాదు
చంద్రబాబు ఇంటి వద్ద ఘర్షణ ఘటనపై టీడీపీ నేతలు గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను టీడీపీ నేతలు కలవనున్నారు. వర్ల రామయ్య, గద్దె రామ్మోహన్, ఆలపాటి రాజాతో కూడిన బృందం గవర్నర్ ను కలసి నిన్న జరిగిన సంఘటనపై వివరాలు అందజేయనున్నారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ దండయాత్రగా చంద్రబాబు నివాసం పైకి వచ్చాడని సీసీటీవీ వీడియోలను సాక్ష్యాలుగా అందజేయనున్నారు.
దండయాత్ర కాదు నిరసన
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు చంద్రబాబు ఇంటికి వెళితే దండయాత్ర అంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ అన్నారు. చంద్రబాబును కలిసి విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్లానన్నారు. తన వెంట వైసీపీ కార్యకర్తలు మాత్రమే ఉన్నారని చెప్పారు. తన కారు అద్దాలు పగులగొట్టారని, దీనిపై చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. అయ్యన్న వ్యాఖ్యలపై బాధ కలిగి నిరసన తెలపడానికి వెళ్తే తన కారుపై రాళ్లేశారని ఆరోపించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యల పట్ల చంద్రబాబు స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతామన్నారు.
Also Read: Political Foul Language : తిట్లకు తిట్లే సమాధానం ! ఏపీ రాజకీయాలు దారి తప్పాయా !?