Chandrababu Naidu on Amaravati:  ఏపీ రాజధాని అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత లభించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పుష్కర కాలం కిందట తాము పునాది వేసిన అమరావతి కల ఇప్పుడు చట్టరూపం దాల్చడం శుభపరిణామమని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపిన ఆయన, పార్లమెంట్‌లో అన్ని పార్టీలు ఈ బిల్లును సమర్థించినా, ఒక్క వైసీపీ మాత్రమే వ్యతిరేకించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు.  దేశంలో అన్ని పార్టీలది ఒక దారైతే, వైసీపీది మరో దారి  అంటూ ఆ పార్టీ వైఖరిని ఎండగట్టారు. తాను తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, నిజానికి సైబరాబాద్, హైటెక్ సిటీల రూపకల్పనతో తెలంగాణ తన  బ్రెయిన్ చైల్డ్  అని చంద్రబాబు గుర్తుచేశారు. విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలని కోరుకున్నానని, కానీ రాజధాని కూడా లేకుండా ఏపీని విడదీయడం అన్యాయమని పేర్కొన్నారు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో తన అనుభవంతో పోలవరం ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయించానని, అవి కలిపితేనే తాను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తానని పట్టుబట్టి సాధించుకున్నానని నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.  

Continues below advertisement

 జగన్  ప్రతిపాదించిన  మావిగన్  వంటి వింత పేర్లపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  ఆ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు అంటూ కౌంటర్ ఇచ్చారు. 2014లోనే 9 నగరాల కలయికతో ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని ప్లాన్ చేశామని, కానీ గత పాలకులు కుట్రలతో, నేరాలతో దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రైతులను రెచ్చగొట్టినా వారు వెనక్కి తగ్గకుండా భూములు ఇచ్చారని, అమరావతి రైతుల త్యాగం వృధా పోదని భరోసా ఇచ్చారు. ఒకప్పుడు హైదరాబాద్ కంటే అమరావతిలోనే భూముల ధరలు ఎక్కువగా ఉండేవని చంద్రబాబు గుర్తుచేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ చుట్టూ భూములు ఇచ్చిన వారు ఎలాగైతే లాభపడ్డారో, భవిష్యత్తులో అమరావతి రైతులు కూడా అదే స్థాయిలో ఆర్థికంగా ఎదుగుతారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో అపారమైన వ్యవసాయ భూములు ఉన్నాయని, సరైన ప్రణాళికతో అభివృద్ధి చేస్తే హైదరాబాద్‌ను మించిన సంపదను సృష్టించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.   

Continues below advertisement

  గత పాలకుల తీరును ఉద్దేశించి మాట్లాడుతూ..  గతంలో వారిని సైకోలు అనేవారు, ఇప్పుడు అవన్నీ మాట్లాడదలుచుకోలేదు  అంటూ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు సంధించారు. వైసీపీ నేతలు గతంలో మంత్రులుగా ఎలా పనిచేశారో అర్థం కావడం లేదని, వారి కుట్రలు ఇక సాగవని హెచ్చరించారు. భగవంతుడు తనకు రెండు గొప్ప అవకాశాలు ఇచ్చాడని, ఒకప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలిపినట్లే, ఇప్పుడు అమరావతిని అత్యుత్తమ రాజధానిగా నిర్మిస్తానని చంద్రబాబు శపథం చేశారు.