Chandrababu Kuppam : కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు రెండో రోజు పర్యటించారు.  తన ఇంటి నిర్మాణాన్ని పరిశీలించారు.  అనంతరం శాంతిపురం బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పంలో తాను కులం, మతం చూడకుండా అందరి ఇంట్లో పెద్ద కొడుకులా ఉన్నానని.. కుప్పం అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని అన్నారు. కుప్పం ప్రాంతానికి వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం చేసిందో చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే హంద్రీనీవాకు నీళ్లు వచ్చేవని అన్నారు. వి.కోట వరకు హంద్రీనీవా నీళ్లు అందించిన ఘనత టీడీపీదేనని స్పష్టం చేశారు. హంద్రీనీవా ప్రాజెక్టును తాను 87 శాతం పూర్తి చేస్తే మిగతా 13 శాతం కూడా పూర్తి చేయలేని దద్దమ్మ పార్టీ వైసీపీ అని చంద్రబాబు విమర్శించారు.             
 
వైసీపీ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనే లేదని.. దోపిడీలు, దుర్మార్గాలు చేయడమే ఆ పార్టీకి తెలుసు అని చంద్రబాబు ఆరోపించారు. దోపిడీ, గజ దొంగలు.. రాష్ట్రాన్ని దోచుకోవడానికే అధికారంలోకి వచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదని.. రైతులను ప్రోత్సహించేందుకు ఏ కార్యక్రమమైనా చేపట్టారా అని చంద్రబాబు ప్రశ్నించారు. మాట ఇచ్చిన ప్రకారం పులివెందులకు తొలుత నీళ్లు ఇచ్చానని.. ఇక్కడ ఉన్న మంత్రి ప్రేమ కుప్పంపై కాదని గ్రానైట్ కోసం అని చంద్రబాబు విమర్శించారు. కుప్పంలో గ్రానైట్ దొంగ వ్యాపారం జరుగుతుందన్నారు.              


వైసీపీ నేతల కళ్లంతా మద్యం, ఇసుక, మైనింగ్‌పైనే ఉందన్నారు. శాంతిపురంలో ప్రభుత్వ స్థలాలను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారని.. దేవుడి భూమిని కూడా వదలడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పం చాలా ప్రశాంతమైన నియోజకవర్గం అని.. గత 35 ఏళ్లలో తాను ఎప్పుడైనా.. ఎవరినైనా ఇబ్బంది పెట్టిన చరిత్రే లేదన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే కుప్పం నియోజకవర్గంలోని పొలాల్లో కూడా సిమెంట్ రోడ్లు వేయిస్తానని చంద్రబాబు చెప్పారు. 100 రోజుల్లో జగన్ మందకు చుక్కలు కనిపిస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.                                     
 
శనివారం కూడా చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు.  30వ తేదీన చంద్రబాబు నాయుడు మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాలకు పీఈఎస్ సమీపంలోని కురుబ భవన్ వద్ద భక్త కనకదాసు విగ్రహావిష్కరణ, బహిరంగ సభ కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు కుప్పం పట్టణంలోని అన్న క్యాంటీన్ సందర్శిస్తారు.  ద్దపల్లి గంగమ్మ ఆలయంలో మధ్యాహ్నం 2 గంటల 45 నిమిషాలకు పూజలు చేస్తారు. 3 గంటల 30 నిమిషాలకు కుప్పం మసీదులో ప్రార్థనలు, ముస్లిం మైనారిటీలతో ముఖాముఖి నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు కుప్పం మండలం మల్లానూరు ఆర్టిసి బస్టాండ్లో బహిరంగ సభలో పాల్గొంటారు.