Andhra Pradesh Commission to review cases :  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జగన్ హయాంలో నమోదు చేసిన రాజకీయ కేసులపై కమిషన్ వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అసెంబ్లీలో శాంతిభద్రతల అంశంపై జరిగిన చర్చలో తెలుగుదేశం పార్టీ నేతలు,వారి కుటుంబసభ్యులతో పాటు ప్రభుత్వంపై పోరాడిన ఇతర వర్గాలపై పెట్టిన కేసుల ప్రస్తావన వచ్చింది. ఈ సందర్భంగా.. సభలో ఉన్న సభ్యుల్లో ఎనభై శాతం మందిపైనా కేసులు నమోదయిన విషయం స్పష్టమయింది. వైసీపీ హయాంలో కేసులు నమోదైన వాళ్లు లేచి నిలబడమని చంద్రబాబు కోరితే..సభలో ఉన్న వారిలో దాదాపు ఎనభై శాతం మంది నిలబడ్డారు. వారందరిపై ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టారని.. ప్రభుత్వంపై పోరాడకుండా కట్టడి చేయడానికే ఇలా కుట్ర పూరితంగా వ్యవహరించారని టీడీపీ సభ్యులు ఆరోపించారు. 


జగన్ తన రాజకీయ నియంతృత్వాన్ని నిరూపించుకోవడానికి ప్రతిపక్ష నేతలందరిపైనా చట్ట విరుద్ధంగా కేసులు పెట్టించారన్నారు. పవన్ కల్యాణ్ తో పాటు.. చంద్రబాబుపైనా అక్రమ కేసులు పెట్టారని అన్నారు. ఈ అంశంపై పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేసిన తర్వాత సీఎం చంద్రబాబునాయుడు.. పార్టీ నేతలతో పాటు కార్యకర్తలపై వేలాది కేసులు పెట్టారని వారందరికీ న్యాయం చేయాల్సి ఉందన్నారు. ఏం చేయాలన్నదానిపై పరిశీలన చేస్తున్నామని ఓ కమిషన్ వేసే ఆలోచన ఉందన్నారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఉండేలా పరిశీలించి .. కేసుల నుంచి విముక్తి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు తమ సమస్యల కోసం పోరాడిన టీచర్లపైనా పెద్ద ఎత్తున కేసులు పెట్టారని చంద్రబాబు గుర్తు చేశారు.                        


గత ప్రభుత్వ హయాంలో కొంత మంది పోలీసులు అధికారులు కూడా జగన్ మోహన్ రెడ్డి కుట్రల్లో భాగం పంచుకుని తప్పుడు సాక్ష్యాలను సృష్టించి.. అసలు తప్పు జరగకపోయినా.. సమాచారం దాచి పెట్టి మరీ తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నేతల్ని అరెస్టు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సీఐడీ చీఫ్‌లుగా పని చేసిన పీవీ సునీల్ కుమార్, సంజయ్, ఇంటిలిజెన్స్ చీఫ్ గా పని చేసిన సీతారామాంజనేయులు, ఐపీఎస్ అధికారి కొల్లి రఘురామిరెడ్డి వంటి వారు నేరుగా టీడీపీ ముఖ్య నేతల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొత్త ప్రభుత్వంలో వారెవరికి పోస్టింగులు ఇవ్వలేదు. ఇప్పుడు కమిషన్ ఏర్పాటు ద్వారా వారు చేసిన తప్పుడు పనులన్నింటినీ బయట పెట్టి చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. 


టీడీపీ, జనసేన, బీజేపీ కోసం పోరాడి అనేక మంది కేసుల పాలయ్యారు. కింది స్థాయి కార్యకర్తలు ఎక్కువ మంది సోషల్ మీడియా కేసుల్లో ఇరుక్కున్నారు. వారందరికీ వీలైనంత త్వరగా రిలీఫ్ కల్పించాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తాజా ప్రకటన నిరూపిస్తోందని చెబుతున్నారు. అలాగే తప్పుడు కేసులు పెట్టిన అధికారుల్ని కూడా వదిలేది లేదని చెప్పడంతో గత ప్రభుత్వ పెద్దల కోసం చట్టాలను ఉల్లంఘించిన అధికారులకు శిక్ష తప్పదన్న వాదన వినిపిస్తోంది