Chandrababu to Ayodhya :  అయెధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళుతున్నారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఆయన అయోధ్యకు బయల్దేరుతున్నారు. 22న జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కార్యక్రమానికి రావాలని కోరుతూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు  చంద్రబాబును ఆహ్వానించారు.  జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని చేర్చారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి 8 వేల మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి.                        


తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయరంగం నుంచి  పవన్ కల్యాణ్ తో పాటు చంద్రబాబునాయుడుకు ఆహ్వానం వచ్చింది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా దేశం లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు, ప్రతిపక్ష నేతలకు, సీనియర్‌ నేతలకు, అలానే వివిధ రంగాల ప్రముఖులకు శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వానం పంపుతున్నారు. ఇక ఇప్పటికే జనవరి 22 వ తేదీ జరగనున్న రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు పారరంభమైయ్యాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల నుండి కూడా అయోధ్య రామునికి వివిధ రూపాలలో సేవలు అందుతున్నాయి.                            


అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానాలు పంపలేదని తెలుస్తోంది. సీఎం జగన్ అన్యమతస్తుడు అయినందున రామజన్మభూమి ట్రస్ట్ ఆహ్వానం పంపదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది కాబట్టి.. తెలంగాణ సీఎంకూ ఆహ్వానం పంపే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. చంద్రబాబుకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపడం రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.                          


రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా  దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం కనిపిస్తోంది.  ప్రధాని మోదీ ఆలయం ప్రారంభోత్సవం చేయనున్నారు. విగ్రహ ప్రతిష్ఠ ముహూర్తం ఖరారు అయింది. ఆ ముహూర్తాన ప్రతీ ఇంటా దీపం వెలిగించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. దీంతో, కీలకమైన ఈ సమయంలో అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి హాజరు కావాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 21న సాయంత్రం చంద్రబాబు అయోధ్య వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.