Chandrababu has finalized TDPSC cell president MS Raju as Bapatla MP candidate : బాపట్ల ఎంపీ స్థానికి తెలుగుదేశం పార్టీ తరపున ఎం.ఎస్.రాజును చంద్రబాబు ఖరారు చేశారు. ఎంఎస్ రాజు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఉన్నారు. సుదీర్ఘంగా వైసీపీపై పోరాటం చేయడంలో ఆయన  ముందు ఉన్నారు. ఆందోళనల్లో పలు సార్లు లాఠీచార్జ్ కు గురై గాయాలు అయినా వెనక్కి తగ్గలేదు. చంద్రబాబుతో పాటు పార్టీ నేతలపై అసభ్యంగా దూషించే వారిపైనా విరుచుకుపడేవారు. అదే భాషను ప్రయోగించేవారు.  పార్టీ కోసం కష్టపడిన ఆయనకు గుర్తింపు ఇవ్వాలని చంద్రబాబు అనుకున్నారు. అదే సమయంలో  2014, 2019లో పోటీచేసిన మాల్యాద్రి ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా లేరు. దీంతో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి వచ్చింది.                         


బాపట్ల రిజర్వుడు నియోజకవర్గం . తెలుగుదేశం పార్టీకి బలమైన నియోజవకర్గంగా పేరు ఉంది. పేరుకు బాపట్ల ఎంపీ అయినా ప్రకాశం జిల్లాలోనే నాలుగు అసెంబ్లీ నియోజకవర్గా ఉంటాయి. వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, అద్దంకి, చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాలు బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉన్నాయి. ఈ నియోజకవర్గాలన్నింటిలో బీజేపీ బలంగా ఉండటంతో గెలుపు ఖాయమన్న అంచనాల్లో ఉన్నారు. ఈ క్రమంలో టిక్కెట్ కోసం గట్టి పోటీ నెలకొంది. వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఉండవల్లి శ్రీదేవి పేరును కూడా బాపట్ల ఎంపీ స్థానానికి పరిశీలించారు. అయితే సామాజిక సమీకరణాలు కుదరకపోవడంతో పాటు.. పార్టీ కోసం పని చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఎంఎస్ రాజును ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.                              


గత ఎన్నికల్లో బాపట్ల ఎంపీగా అమరావతి ప్రాంతానికి చెందిన నందిగం సురేష్ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థిగా నిలబడిన ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాల్యాద్రిపై పదహారు వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే ఈ సారి బాపట్ల నుంచి వైసీపీ తరపున ఆయనకు టిక్కెట్ ఖరారు చేశారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. అయితే  మరొకరి పేరు కూడా వినిపించడం లేదు. సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకే టిక్కెట్ ఖరారు చేస్తారని భావిస్తున్నారు.  అంటే వచ్చే ఎన్నికల్లో సురేష్ వర్సెస్ ఎంఎస్ రాజు అన్నట్లుగా పోరాటం సాగనుంది.                                                     


జమిలీ ఎన్నికలు జరుగుతూండటంతో..  ఎంపీ అభ్యర్థుల అంశం పెద్దగా హైలెట్ కావడం లేదు. ఎమ్మెల్యే .. రాష్ట్ర అంశాలే ఓటింగ్ ప్రాతిపదికలు అవుతున్నాయి. ఈ కారణంగా ఎంపీ అభ్యర్థులకు కూడా... రాష్ట్ర అంశాల ఆధారంగానే ఓటింగ్ జరుగుతూ వస్తోంది.