AP TDP president Achchennaidu demanded that health emergency be imposed in Guntur :  రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అందని సురక్షిత తాగునీరు అందకపోవడంతో కలుషిత జలంతో డయేరియా బారిన పడుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు.  కలరా ప్రబలి ఆస్పత్రుల్లో చేరుతున్న రోగులు ప్రాణాలకు  ముప్పు ఏర్పడిందన్నారు.  యుద్ధప్రాతిపదికన సురక్షిత తాగునీరు అందించాలి, గుంటూరులో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సీఎం జగన్ కు బహిరంగ లేఖ రాశారు. 


గ్రామ పంచాయతీ నిధులు దారి మళ్లించడం, పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తాగునీటి పథకాలను సక్రమంగా నిర్వహించకపోవడం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను అర్ధాంతరంగా నిలిపేయడం వంటి చర్యలతో ప్రజల ఆరోగ్య పరిస్థితి గాల్లో దీపంలా మారిందని అచ్చెన్నాయుడు విమర్శించారు.  ప్రజలకు తాగునీరు సరఫరా చేయలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటు కాదా? లక్షలాది మంది ఆస్పత్రులపాలవుతున్నా ఏమీ పట్టనట్టు అధికార యంత్రాంగం వ్యవహరించడం మీ ప్రభుత్వ పాలనా వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు.  మీ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం మీకు తెలుసా ముఖ్యమంత్రి గారూ? ఇంతటి భయానక పరిస్థితులపై ఒక్కసారైనా మీరు స్పందించారా ? అని నిలదీశారు. 


కలుషిత నీటి సరఫరాతో గుంటూరులో డయేరియా బారిన పడి నలుగురు మృతిచెందారు. వందలమంది ఆస్పత్రుల పాలయ్యారు. అవే కలుషిత జలాల కారణంగా కలరా మహమ్మారి గుంటూరును వణికిస్తోంది. ముగ్గురికి కలరా సోకింది. ఇంతటి ప్రమాదక పరిస్థితులు తలెత్తితే చర్యలు తీసుకోవాల్సిన మంత్రి విడదల రజనీ అసలు విషయం బయటకు రాకుండా తొక్కిపెట్టడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనన్నారు.  గుంటూరు నగరంలో పలుచోట్ల తాగునీటి పైపులైన్లు మురుగునీటి కాల్వలను క్రాస్‌ చేస్తూ వెళుతున్నాయి. ఈ క్రమంలో పైపు లైన్లు పగిలిపోయి లీకేజీ కారణంగా తాగునీరు కలుషితమవుతోంది. నేటికీ ముగు నీటిలోనే మంచినీటి పైపు లైన్లు ఉన్నా అధికారులకు చీమకుట్టినట్టు లేదన్నారు. 


టీడీపీ హయాంలో నెలకోసారి వాటర్ ట్యాంక్ లు క్లీన్ చేసేవారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. మిగిలిన 10 శాతం పూర్తి చేసివుంటే నేడు హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించే పరిస్థితి వచ్చేది కాదు. ఆరోగ్యాంధ్రప్రదేశ్, ఆరోగ్య విప్లవం, ప్రజారోగ్యమే మా ధ్యేయమంటూ ప్రచారార్భాటం చేయడం వల్ల ప్రజల ప్రాణాలు నిలబడతాయా? మీరు అధికారంలో ఉండే ఈ నెల రోజుల్లోనైనా సక్రమంగా పనిచేయండి. రాజకీయ లబ్ధి కోసం విపక్షాలపై విమర్శలు చేయడం మానేసి ప్రజల ప్రాణాలను కాపాడటంపై దృష్టి పెట్టండి. డ్రైనీజీ వ్యవస్థను పునరుద్ధరించండి.  శుద్ధిచేసిన మంచినీటిని సరఫరా చేయండి. అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని లేఖలో డిమాండ్ చేశారు.