Anantapur MLA Daggupati Venkateswara Prasad | అమరావతి: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తాజా వివాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో గ్రూపు తగాదాలు, అంతర్గత విభేదాలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. పార్టీకి లేదా ప్రభుత్వానికి నష్టం కలిగించే చర్యలు ఏవైనా ఉంటే, అవి ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు కేంద్రంగా ముదలైన వివాదాలు, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు, ఆముదాలవలస, గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేల వ్యవహారాలపై కూడా చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

ఎమ్మెల్యేలు చిన్న విమర్శలకు కూడా అవకాశం ఇవ్వకుండా నడుచుకోవాలని ఆయన హెచ్చరించారు. పార్టీ మీదగానీ, కూటమి ప్రభుత్వం నిర్ణయాలు, సంక్షేమ పథకాల అమలుపైగానీ తప్పుడు ప్రచారం జరిగితే టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు వెంటనే ప్రజల ముందు నిజాలు ఉంచాలని ఆదేశించారు. ఎమ్మెల్యేలు లేదా నేతలు చేసిన తప్పుల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తే, పార్టీ ఎందుకు బాధపడాలని ప్రశ్నించారు.

పార్టీ నాయకత్వం నుండి మూడు ప్రధాన అంశాలపై చంద్రబాబు నివేదిక కోరినట్టు సమాచారం. సూపర్ సిక్స్‌లో భాగంగా ఉన్న "స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం"పై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండించాలని నేతలకు సూచించారు. ప్రజలతో మమేకం కావడం వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని, కానీ అనవసర వివాదాలు తెచ్చుకుంటే తగిన చర్యలు తప్పవని చంద్రబాబు నేతలకు హెచ్చరించారు.

టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యల ఆడియో వైరల్జూనియర్ ఎన్టీఆర్ సినిమా వచ్చిందంటే చాలు కాంట్రవర్సీ జరుగుతోంది. అది వైసీపీ నేతల పని అని టీడీపీ నేతలు చెబుతుంటే.. ఎన్టీఆర్ ను టీడీపీలోకి రాకుండా చంద్రబాబు, లోకేష్ చేస్తున్న కుట్ర అని వైసీపీ నేతలు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల విడుదలైన వార్ 2 సినిమాతో పాటు ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఓ ఆడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పై చెప్పరాని విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లుగా ఆడియోలో ఉంది.

'మంత్రి నారా లోకేశ్ గురించే తప్పుగా మాట్లాడతాడా? ఎన్టీఆర్ లేటేస్ట్ మూవీ 'వార్ 2' ఎలా ఆడుతుందో చూస్తా. అనంతపురంలో వార్ 2 సినిమా ప్రదర్శనను నిలిపేయాలి' అని వార్నింగ్ ఇచ్చినట్లుగా ఉన్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే ఫ్లెక్సీలు చింపేశారు. అతడు ఎన్టీఆర్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని, నాలుగు గోడల మధ్య వీడియో రిలీజ్ చేయడం కాదని హెచ్చరించారు. 

ప్రజా ప్రతినిధి అయి ఉండి, అది కూడా టీడీపీ ఎమ్మెల్యే అయి ఉండి ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుంటామనడం సరికాదని సూచించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇంటిని ముట్టడిస్తామని, తప్పు తెలుసుకునేలా చేస్తామని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నారు. వివాదం పెద్దది కావడం, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో టీడీపీ ఎమ్మెల్యే స్పందించారు. ఎన్టీఆర్ అభిమానులకు సారీ చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆడియో కాల్ తనది కాదని, తనపై ఉద్దేశపూర్వకంగా కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే క్లారిటీ ఇచ్చారు.